హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తేతెలంగాణ) : ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తాసీల్దార్లు, డిప్యూటీ తాసీల్దార్లను పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని ట్రెసా(తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్) బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 150 మంది తాసీల్దార్లు, డిప్యూటీ తాసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారని, తిరిగి వారిని పూర్వపు జిల్లాలకు పంపించాలని మంత్రికి విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షులు కే నిరంజన్, బాణాల రాంరెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు రమణ్‌రెడ్డి, చంద్రశేఖర్, మధుకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరిలో ‘వేవ్స్’కు భారత్ ఆతిథ్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (WAVES-వేవ్స్)కు భారత ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆరిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ)ఆడిటోరియంలో శుక్రవారం వేవ్స్ ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దేశ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమను బలోపేతం చేయడానికి, ఆ రంగానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు వేవ్స్‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు. వేవ్స్.. భారత్‌ను మీడియా ఎంటర్టైన్మెంట్(ఎంఈ) రంగంలో అపరిమితమైన గ్లోబల్శక్తిగా నిలపబోతుందని ధీమా వ్యక్తంచేశారు. ‘క్రియేట్ ఇన్ ఇండియా’ చాలెంజ్ వేవ్స్ సీజన్-1 ప్రారంభమైందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.