హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల సవరణ కోసం ఏర్పాటైన తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి సరికొత్త అధికారాలను సర్కారు కట్టబెట్టనున్నది. కొత్తగా కళాశాలల్లో తనిఖీలు చేసే అధికారాలను కూడా టీఏఎఫ్ఆర్సీకి అప్పగించనున్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల ఖరారు, సవరణకు అనుసరిస్తున్న పద్ధతులను సర్కారు సమూలంగా మార్చనున్నది. నిబంధనల్లో భారీ మార్పులు తీసుకురానున్నది. ఇటీవల వచ్చిన కోర్టు తీర్పును సైతం పరిగణనలోకి తీసుకోనున్నది. 2015 జూలైలో అప్పటి సర్కారు టీఏఎఫ్ఆర్సీని ఏర్పాటుచేస్తూ జీవో 160ని విడుదల చేసింది.
ఫీజుల సవరణ మార్గదర్శకాలను కూడా అదే జీవోలో పేర్కొన్నది. కళాశాలల్లో వసతులు, ఆదాయం, ఖర్చుల వివరాలపై ఆడిటర్లు ఆమోదిస్తే వాటినే ఫీజుల ఖరారుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ ఒక్క నిబంధనతో కొన్ని కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాన్నయన్నది ప్రభుత్వ వర్గాల వాదన. ఆడిటర్ల ద్వారా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఫీజులు పెంచుకుంటున్నాయన్నది సర్కారు అభ్యంతరం. ఈ నేపథ్యంలో కేవలం డాక్యుమెంట్లు చూసి ఆమోదించే నామమాత్రపు అధికారాలు కాకుండా, ఇక నుంచి కాలేజీల్లో తనిఖీలు చేసే అధికారాలను టీఏఎఫ్ఆర్సీకి అప్పగించనున్నారు. కేరళలో టీఏఎఫ్ఆర్సీకి ఇలాంటి అధికారాలే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్న ఎఫ్ఆర్సీ కాలేజీల్లో ప్రత్యక్షంగా తనిఖీలు చేస్తున్నది. ఇదే తరహా అధికారాలను మన రాష్ట్రంలోని టీఏఎఫ్ఆర్సీకి అప్పగించనున్నారు.
ఫీజుల సవరణకు పటిష్ఠ మార్గదర్శకాలను రూపొందించేందుకు సర్కారు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నది. కమిటీ నియామకానికి సచివాలయంలో కసరత్తు జరుగుతున్నది. రెండు, మూడు రోజుల్లో ఈ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ కమిటీ ఇతర రాష్ర్టాల్లో ఫీజుల సవరణకు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులపై అధ్యయనం చేసి, సిఫారసులు చేస్తుంది. ఈ మేరకు నిబంధనల్లో సర్కారు మార్పులు చేయనున్నది. 2025-28 మూడు విద్యాసంవత్సరాలకు ఇంజినీరింగ్ సహా అన్నిరకాల ప్రొఫెషనల్ కోర్సుల ఫీజుల సవరణకు సర్కారు బ్రేక్లు వేసిన విషయం తెలిసిందే. అధ్యయనం, కమిటీని సాకుగా చూపి ఫీజుల పెంపుదలను సర్కారు నిలిపివేసింది. మొత్తంగా ఈ ఒక్క ఏడాది ఫీజుల పెంపు లేకుండా, పాత ఫీజులతోనే సీట్లను భర్తీచేయనుంది.