హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటుతున్నా ఇంకా అణగారిన వర్గాలకు, దళిత, బహుజనులు, మైనార్టీలు, మహిళలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, భారత ప్రజా కాంగ్రెస్ జాతీయ గౌరవాధ్యక్షుడు మూలింటి మారెప్ప అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కింగ్ ఆఫ్ కింగ్స్, ది గుడ్ అడ్మినిస్ట్రేటర్, అనుకున్నది సాధించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, విప్లవవాది, సంఘసంసర్త అని ప్రశంసిస్తూ.. బీఆర్ఎస్ను స్థాపించడాన్ని ఆయన స్వాగతించారు. ఎదిరించేవాళ్లు లేకపోతే హిట్లర్, ముస్సోలినీ, నీరో చక్రవర్తిల పాలన పునరావృతం అవుతుందనే నిజం తెలుసుకున్న వ్యక్తి కేసీఆర్ అని, అది గుర్తించి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ను స్థాపించిన దమ్మున్న నాయకుడు అని కొనియాడారు. ఢిల్లీలో గురువారం మూలింటి మారెప్ప ‘టీన్యూస్’తో మాట్లాడారు.
బీఆర్ఎస్ ఏర్పాటును ఎలా చూస్తున్నారు?
దళిత, బహుజన వాదిగా కేసీఆర్‌కు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. దేశంపై అవగాహన, లౌకికం, దూరదృష్టి, దేశ భవిష్యత్తు, భద్రత, భరోసా, సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు, నిరుద్యోగ సమస్యలపై అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి కేసీఆర్.
దేశంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరముందా?
నేడు దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు అవసరం ఎంతో ఉంది. సమాజం బాగుపడాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు దేశానికి అవసరం. బీఆర్ఎస్ను అభినందిస్తున్నాను. ఎవరో ఒకరు ఎదిరించకపోతే కుదరదు. కేసీఆర్‌లాంటి వాళ్లు ప్రధాని అయితే ఇంకా సంపూర్ణమైన అభివృద్ధి జరుగుతుంది. లెజండరీ లీడర్‌కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని భావిస్తున్నారా?
బీజీపీ హఠావో.. దేశ్ బచావో.. మోదీ బీసీ వాలా, చాయ్ వాలా, అచ్చావాలా అని అనుకుంటే నిరంకుశంగా పాలిస్తున్నాడు. అనేక రంగాలను ప్రైవేట్‌పరం చేసి మన సంపదను మొత్తం అంబానీ, అదానీలకు అప్పజెప్తున్నారు. ఇలాంటి సమయంలో మోదీకి సరైన మొగుడు కేసీఆర్. కాంగ్రెస్ పూరా మిట్టీమే మిల్గయా. ఆ పార్టీ చచ్చిపోయింది. రాహుల్ గాంధీ 52 సంవత్సరాల తరవాత ఇప్పుడు మేల్కొన్నాడు.
మునుగోడు ఉప ఎన్నికలపై మీ అభిప్రాయం ?
మునుగోడులో ఎన్నికను అనవసరంగా తెచ్చారు. ఎవరైతే లక్షల కోట్లు సంపాదించుకున్నారో వాళ్లే వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నాయకత్వం కోసం కొట్లాడుతున్నారు. ఈవీఎం మిషిన్లు వెంటనే తీసేయాలి. ఈవీఎం మెషిన్ ఉన్నంత వరకు దేశంలో బీజేపీ ప్రభుత్వం వస్తూనే ఉంటుంది. కేసీఆర్ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే మాలాంటి అణగారిన వర్గాలు నిండుగా మెండుగా ఆయనకు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం.
తెలంగాణ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?
తెలంగాణాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు భేష్. దళితబంధును బహుజనబంధుగా మార్చి దేశవ్యాప్తంగా అమలు చేయాలి. మోదీ కూడా కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. రైతుబంధు చాలా బాగుంది. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారు.