JNTU | హైదరాబాద్ : జేఎన్టీయూ ఉప కులపతిగా టీ కిషన్ కుమార్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి.. పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. జేఎన్టీయూ వీసీగా నియమితులైన కిషన్ కుమార్ రెడ్డికి యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా నియామక ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడింది. జనవరి 27న సెర్చ్ కమిటీ సమావేశం జరిగినప్పటికీ, తాజాగా శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మూడోసారి నియామక ప్రక్రియ నిలిచిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు జేఎన్టీయూకు పూర్తిస్థాయి వీసీని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జేఎన్టీయూకు ఇన్చార్జ్ వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కొనసాగుతున్నారు.