జగిత్యాల, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీకి మేం కౌలుదారులం కాదు.. పట్టాదారులం. ఆత్మగౌరవాన్ని సంపుకొని బతకలేం’ అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మమల్ని మానసికంగా రోజురోజుకూ ఎందుకు సంపుతరు? ఒక్కసారే పొడిచిపారేయిండ్రి. హలాల్ చేసినట్టు కాకుండా జట్కా కొట్టుండ్రి. ఎందుకీ గోస?’ అంటూ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎదుట ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని బీర్పూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పాలకవర్గ నియామకంలో తాము ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కాకుండా బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రతిపాదించిన వారికి అవకాశం కల్పించడమేమిటని తీవ్రంగా మండిపడ్డారు.
నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్మపురిలో మంత్రి అడ్లూరిని సోమవారం కలిసి తన అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. సుమారు 40 నిమిషాల పాటు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో నలభై ఏండ్లుగా పనిచేస్తున్న తమను కాదని, ఫిరాయింపుదారులకు విలువ ఇవ్వడమేమిటని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపుదారులపై ఆధారపడి ఉన్నదా ? అని నిప్పులు చెరిగారు. ‘ఒరిజినల్ కార్యకర్తలు, నాయకులు చెప్తే పని చేయవద్దు.. ఫిరాయింపుదారులు చెప్తేనే చేయాలని ప్రభుత్వం ఏమైనా విధానం పెట్టుకున్నదా?’ అని ప్రశ్నించారు. పార్టీలో తనను పూచిక పుల్లలా తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
‘దేశంలో రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని రక్షించాలన్న ఆతృతతో కాలికి బలపం కట్టుకొని తిరగుతుంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు, నాశనం చేసేందుకు యత్నిస్తున్నది. ఫిరాయింపుదారులను ప్రోత్సహించడమే రాహుల్‌గాంధీకి మీరిచ్చే బహుమతా?’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘జగిత్యాల నియోజకవర్గంలో గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్ వానికే అన్ని పనులు అప్పగిస్తున్నరు. వాడెవ్వడు.. తెలుసుకోండి..? వాడికి పైసలమీద ఆశ బాగున్నదికావచ్చు.. వానికి పనులు ఇవ్వండి.. అంతేగాని రాజకీయ హక్కులు, బాధ్యతలు, గుర్తింపు కాంగ్రెస్ వాళ్లకు ఎందుకివ్వరు?’ అంటూ నిలదీశారు.
కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ కంటే 25 మంది ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారని, అలాంటప్పుడు ఫిరాయింపుదారులను, కౌలుదారులను నెత్తినపెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లనే మానసికంగా క్షోభకు గురిచేయడం ఏమిటని మండిపడ్డారు. మంత్రి అడ్లూరి కలుగజేసుకొని ‘ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో మీరే మాట్లాడారు కదా.. ఏ పరిస్థితిలో ఆయనను (సంజయ్‌ని) తీసుకోవాల్సి వచ్చిందో చెప్పారు కదా?’ వ్యాఖ్యానించగా ‘ఆరోజే తేలిపోయేది. నేను సత్యంగా చెప్తున్నా నా మానసిక క్షోభకు కారణం మంత్రి శ్రీధర్‌బాబు, నువ్వు మంత్రి లక్ష్మణ్కుమార్వు.. నన్ను మేకను బలిచ్చినట్టు చేసిండ్రు’ అని నిలదీయగా అడ్లూరి హతాశులయ్యారు.
‘పదేండ్ల నుంచి కష్టపడినమమ్మల్ని కాదని ఫిరాయింపుదారుడు, వాడి అనుచరులకు మేలు చేస్తున్నరు. వానితో కలిసిపొమ్మని చెప్తున్నరు. సీఎం మాకు సీఎం కాదా? మాకుపనిచేయడా? ఫిరాయింపుదారుల ముందు తలవంచుకోలేం. అవమానంతో బతకడం బాధగా ఉన్నది. నలభై ఏండ్లు పోరాటం చేసి బతికినమే తప్ప, ఇట్ల మానసికక్షోభకు గురికాలే’ అని వాపోయారు.
‘పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నం. ఇప్పుడు పడుతున్న వేదన అప్పుడు లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంగిలి మెతుకుల కోసం వెళ్లే వ్యక్తి మా పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నడు. మేము కాంగ్రెస్ పార్టీకి కౌలుదారులం కాదు.. పట్టేదారులం. ఆత్మగౌరవాన్ని సంపుకొని బతకలేం. పార్టీ మా స్థానం ఏంటో తేల్చిచెప్తే మా దారి మేం చూసుకుంటం’ అంటూ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.