హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : మెదడు నిండా కొత్త ఆలోచనలు.. తమ ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్న యువత.. శక్తినంతా ధారపోసి శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నా.. అడ్డొస్తున్న ఆర్థిక స్థోమత.. సొంతంగా వనరులు సమకూర్చుకోలేని నిస్సహాయత.. ఇలాంటి స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు టీ హబ్, టీ వర్క్స్ ఒక ఆశాదీపంగా నిలిచాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ రెండు సంస్థలు వేలాది మంది యువత జీవితాలను మార్చేశాయి. ముఖ్యంగా టీవర్క్స్తో ప్రపంచ స్థాయి యంత్రపరికరాలు, వనరులు అందుబాటులోకి వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల మార్గనిర్దేశనంలో వేలాది మంది యువత ఆలోచనలు ఆవిష్కరణలుగా రూపాంతరం చెందాయి.. చెందుతున్నాయి. మనసులో ఆలోచనలతో, ఉత్తి చేతులతో అడుగుపెట్టినవారు ఇప్పుడు కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. వారెవరిని కదిలించినా ‘కేటీఆర్ సాయం.. మార్చింది మా జీవితం’ అని ముక్తకంఠంతో చెప్తున్నారు.
ప్రతిభ ఉన్నవారు ఎక్కడున్నా గుర్తించి ప్రోత్సహించడంలో కేటీఆర్ ముందుంటారు. అందుకే.. ఆలోచనలు ఉన్నా, అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారిని గుర్తించేందుకు ‘ఇంటింటి ఇన్నోవేటర్’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇది గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎంతో మంది యువత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. వారిని ఆవిష్కర్తలుగా మార్చి, ఎదిగేందుకు సాయపడింది. ఇందుకు ఉదాహరణే సూర్యాపేటకు చెందిన అశోక్ గొర్రె. ఆ యువకుడు ప్రస్తుతం ‘రూరల్ రైజ్ అగ్రినరీ’ అనే స్టార్టప్‌ను నడిపిస్తున్నారు. కేటీఆర్ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో తన ఆలోచనలకు రెక్కలొచ్చాయని, అమెరికా వరకు ఎగరగలిగానని, ఇప్పుడు తన సొంత ఆవిష్కరణలతో ఈ ప్రపంచానికి పరిచయం అవుతున్నానని సంతోషంగా చెప్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో 2019లో నిర్వహించిన ఇంటింటి ఇన్నోవేటర్ కార్యక్రమంలో అశోక్ ఎంపికయ్యారు. ఆ తర్వాత కలకత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డు సాధించారు.
ఆ తర్వా త కేటీఆర్ స్వయంగా అశోక్‌ను పిలిపించుకొని అభినందించారు. ‘2019 నవంబర్ 9వ తేదీ ఎప్పటికీ మరిచిపోలేను. కేటీఆర్ సార్ నన్ను ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు. నా ఆవిష్కరణలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు’ అని రమేశ్ గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు టీ-వర్క్స్ ద్వారా ఫెలోషిప్ ప్రోగ్రామ్ రూపంలో సాయం అందిందన్నారు. ‘ప్రపంచ స్థాయి యంత్రాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణుల మార్గనిర్దేశనంలో నేను నా ఆలోచనల మేరకు కొత్తరకం పరికరాలను తయారు చేశాను. వాటిని పరీక్షించి, మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కలిగింది’ అని పేర్కొన్నారు. తాను 2023లో అమెరికాలోని నెబ్రస్కాలో జరిగిన ‘అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ బయోలాజికల్ ఇంజినీరింగ్ కాన్ఫరెన్స్’కు హాజరయ్యేందుకు కూడా సహాయం అందిందని గర్వంగా చెప్తున్నారు. ఆశోక్ ప్రస్తుతం తన స్టార్టప్‌లో రూపొందించిన 8 రకాల వ్యవసాయ రంగ ఉత్పత్తులను పరీక్షిస్తున్నారు. ఇందులో ఆరు పరికరాలుకాగా, రెండు మల్టీపర్పస్ వెహికిల్ స్ప్రేయర్లు. 14 మంది రైతులు ఇప్పటికే అశోక్ రూపొందించిన పరికరాలను వాడుతున్నారు. మరింత సమర్థమైన, తక్కువ ధరకు పరికరాలను తీసుకొచ్చేలా శ్రమిస్తున్నానని అశోక్ తెలిపారు.
ఒకరికి డబ్బు సాయం చేయడం కన్నా.. డబ్బును సంపాదించే మార్గం చూపిస్తే వారి జీవితం బాగుపడుతుందన్నది పెద్దల మాట. టీవర్క్స్, టీహబ్ స్థాపనతో దీనిని కేటీఆర్ అక్షరాలా నిజం చేసి చూపించారు. వందల మంది గ్రామీణ ప్రాంత యువకులు ఆవిష్కర్తలుగా ఎదగడమే కాదు.. ఇప్పుడు తమ ఉత్పత్తులను సగర్వంగా ప్రపంచానికి పరిచయం చేస్తూ కొత్త శిఖరాలను చేరుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ వరంగల్ జిల్లా గోపాలపురం ప్రాంతానికి చెందిన ముప్పారపు రాజు. తన పేరుమీదే ‘రాజు ఆటో సెన్సార్’ను ఆవిష్కరించిన ఈ యువకుడిని కదిలిస్తే.. కేటీఆర్ చేసిన సాయాన్ని, టీ వర్క్స్‌తో తన అనుబంధాన్ని వివరిస్తారు. వీధి దీపాలను ఆన్ ఆఫ్ చేసేందుకు వ్యక్తుల ప్రమేయాన్ని తగ్గించేందుకు కొత్తగా సెన్సార్లతో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. సూర్యకాంతిని బట్టి ఆటోమెటిక్‌గా లైట్లు ఆన్, ఆఫ్ అయ్యేలా దీనిని అభివృద్ధి చేశారు.
అంతేకాదు.. మక్కజొన్న కంకులతో పెన్నులు, సోలార్ మొబైల్ చార్జర్లు వంటివి రూపొందించారు. ‘నా ఆవిష్కరణలు నచ్చి కేటీఆర్ సార్ నా గురించి ట్వీట్ చేశారు. ఆ తర్వాత నా జీవిత గమనమే మారిపోయింది. నా సెన్సార్ వ్యవస్థ పనితీరు నచ్చడంతో 2022లో పైలట్ ప్రాజెక్టుగా 400 గ్రామాలను ఎంపిక చేసి, నా ఆటోమేషన్ వ్యవస్థను ఇన్స్టాల్ చేసే అవకాశం ఇచ్చారు’ అని రాజు పేర్కొన్నారు. అక్కడ తన సెన్సార్లు సమర్థంగా పనిచేస్తున్నాయన్నారు. తన ఆటోమేషన్ వ్యవస్థను మున్సిపాలిటీలకు విస్తరించాలని భావిస్తున్నారు. ‘ప్రస్తుతం మున్సిపాలిటీల్లోని వీధిలైట్ల నిర్వహణకు సంబంధించి ఈఈఎస్ఎల్తో ఉన్న కాంట్రాక్ట్ గడువు ముగిసింది. కొత్త నిర్వాహకుల కోసం టెండర్లు పిలిచారు. నాలాంటి చిన్న స్టార్టప్‌లు టెండర్లలో పాల్గొని, బిడ్డింగ్ వేసి పనులు దక్కించుకునే అవకాశం ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తే మెరుగైన వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెస్తానని చెప్తున్నారు.