Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హస్తినలో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలకు ఘోర అవమానం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన నేతలను ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిసింది. ‘నోరు మూసుకొని వెళ్లండి. ఇంకోసారి బీసీ టికెట్ల డిమాండ్ చేస్తే బాగుండదు. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో మాకు తెలుసు. మరోసారి ఈ డిమాండ్‌తో రచ్చకెక్కితే సహించేది లేదు’ అంటూ హెచ్చరించినట్టు సమాచారం.
ఈ ఎన్నికల్లో అధిక సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లోని బీసీ నేతలు పోరాటం చేస్తున్నారు. అయితే ఇక్కడ వారికి ఆశించిన హామీ దక్కకపోవడంతో అధిష్ఠానం వద్దే తేల్చుకోవాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారి అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఆయన బీసీ నేతలను తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. ‘బీసీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలో అన్నే ఇస్తాం. మీరు డిమాండ్ చేసినన్ని సీట్లు ఇవ్వాలా ఏంటి?’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా బీసీలను కించపరిచేలా ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు చెప్తున్నారు.
ఇది‘బీసీ’లకు జరిగిన అవమానం
ఢిల్లీలో జరిగిన పరిణామాలతో అవాక్కైన నేతలు తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలిసింది. ఇది తమకు జరిగిన అవమానంగా భావించడం లేదని, బీసీలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నామని ఆ నేతలు అన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో బీసీ నేతలకు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో బీసీలకు భవిష్యత్తు లేదని తేలిపోయిందని, ఈ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని వారు అన్నట్టు సమాచారం. ఈ అవమానాన్ని మర్చిపోబోమని, తమ సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. పలు చోట్ల పార్టీకి వ్యతిరేకంగా రెబల్‌గా పోటీ చేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.