హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీ బాండీబీచ్లో (Bondi Beach Shooting) హునుక్కా వేడుకల్లో ఆదివారం జరిగిన ఉగ్రదాడికి హైదరాబాద్‌లో (Hyderabad) లింకులు బయటపడ్డాయి. దాడుల్లో ప్రధాన నిందితుడు సాజిద్అక్రమ్ (50) స్వస్థలం హైదరాబాద్ అని ఆస్ట్రేలియా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. సాజిద్ వద్ద భారత పాస్‌పోర్ట్ లభించిందని వెల్లడించాయి. కాల్పుల ఘటనలో సాజిద్ కుమారుడు 24 ఏండ్ల నవీద్ అక్రమ్ కూడా పాల్గొన్నాడు. దాడిలో 15 మంది పౌరులు మృతిచెందారు. దాడి సమయంలో పోలీసు కాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ టోలిచౌకికి చెందిన సాజిద్.. ఇంజినీరింగ్ చదువుకుని, 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడే స్థిరపడినట్టు చెప్పారు. యూరోపియన్ మూలాలు కలిగిన వేనేరాగ్రాసోను పెండ్లి చేసుకున్నాడని పేర్కొన్నారు.
ఆరుసార్లు నగరానికి రాక
హైదరాబాద్ టోలిచౌకిలోని అల్హుస్సేన్ కాలనీకి చెందిన సాజిద్ అక్రమ్.. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత ఇక్కడి ఆస్తి పంపకాలు, తల్లిదండ్రులను కలుసుకోవడం వంటి కారణాలతో ఆరుసార్లు నగరానికి వచ్చినట్టు డీజీపీ ప్రకటనలో చెప్పారు. 1998లో భారత్‌ను విడిచి వెళ్లే వరకు సాజిద్‌కు నేరచరిత్ర లేదని వెల్లడించారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌కు రాకపోకలు సాగించినట్టు చెప్పారు. సాజిద్ 2017లో తల్లిదండ్రులను చూడడానికి హైదరాబాద్ వచ్చాడని తెలిపారు. మళ్లీ 2022లో సిటీకి వచ్చి టోలిచౌకీలోని ఆస్తులను అమ్ముకుని వెళ్లాడని వివరించారు. కేంద్రసంస్థలు, ఇతర భద్రతా ఏజెన్సీలకు సహకరిస్తామని తెలిపారు.
ఎక్కడేం జరిగినా ఇక్కడే ఆనవాళ్లు!
దేశ, విదేశాల్లో ఎక్కడ ఉగ్రదాడులు, కుట్రలు జరిగినా చాలా కేసులలో మూలాలు హైదరాబాద్‌లోనే బయటపడుతున్నాయి. సిడ్నీ ఉగ్రదాడి ప్రధాన నిందితుడు సాజిద్ స్వస్థలం హైదరాబాద్ అని తేలడంతో నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో అహ్మద్ స్వస్థలం రాజేంద్రనగర్. మేలో బాంబు పేలుళ్ల రిహార్సల్స్ చేస్తున్న ఇద్దరిని ఏపీ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేశారు. ఇందులో ఒక నిందితుడు బోయగూడ రైల్ కళారంగ్ బస్తీకి చెందిన వ్యక్తి. రెండేండ్ల క్రితం మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. 2017లో ముగ్గురు యువకులు ఐసిస్‌లో చేరేందుకు నగరం నుంచి వెళ్లగా వారిని… పోలీసులు కశ్మీర్లో అరెస్ట్ చేశారు. 2019లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కర్ణాటకలో బాంబు పేలుళ్ల నిందితుడిని టోలిచౌకిలో అరెస్ట్ చేశారు.