Swine flu | మక్తల్, నవంబర్ 6 : నారాయణపేట జిల్లా మక్తల్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి రాఘవేంద్రరెడ్డి తెలిపిన వివరాలు.. మక్తల్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి నాగప్ప అనారోగ్యంతో బాధపడుతుండగా వారం క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. రక్తనమూనాలు పరీక్షించగా స్వైన్‌ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.
రాష్ట్ర వైద్యారోగ్య కార్యాలయ అధికారులు బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో మక్తల్‌లో స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి ఇంటి పరిసరాల్లోని 60 కుటుంబాలకు పరీక్షించగా.. ఏ ఒకరికీ వ్యాధి లక్షణాలు కనిపించలేదు. నాగప్ప వద్ద ఉంటున్న ముగ్గురిని పరీక్షించగా.. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. స్వైన్‌ఫ్లూకు మందులున్నాయని, ప్రజలు అధైర్యపడొద్దని డీఎంహెచ్ఓ రాఘవేంద్రరెడ్డి తెలిపారు.