పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పనిచేస్తున్న బండి మధునయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం స్కూల్‌కు వచ్చిన మధునయ్యను పాము కరిచింది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
గుర్తించిన స్థానికులు మధునయ్యను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతదేహంతో పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.