హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో కొత్తగా నియమితులైన ముగ్గురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణం స్వీకరించారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు మొదటి హాల్లో జరిగిన ఫుల్ కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే వారితో ప్రమాణం చేయించారు. న్యాయవాదుల కోటా నుంచి లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి, న్యాయాధికారుల కోటా నుంచి సుజన కళాసికం (హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్) అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో హైకోర్టులో సీజేతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. మరో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాయంత్రం హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ముగ్గురు కొత్త న్యాయమూర్తులు హాజరయ్యారు. వీరిని అసోసియేషన్ నేతలు సతరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, చెంగల్వ కల్యాణ్రావు, కృష్ణకుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.