‘స్వరాజ్యం నా జన్మహక్కు..ఈ నినాదం వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు బాలగంగాధర్ తిలక్. ఉద్యమ రణన్నినాదంగా దీన్ని తిలక్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఈ నినాదాన్ని సృష్టించింది కాకా బాప్టిస్టా అని తిలక్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయట.
కాకా బాప్టిస్టా న్యాయవాది. తిలక్, అనీబిసెంట్లాంటివారితో కలిసి హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. కాకా 1864 మార్చి 17న ఈస్ట్ ఇండియన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. దాదాభాయ్ నౌరోజీ సూచనలతో యూకే వెళ్లి లా చదివారు. లాతోపాటు పొలిటికల్ సైన్స్ డిగ్రీని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఫిట్జ్‌విలియం కళాశాలలో పూర్తిచేశారు. యూకేలో ఐరిష్ హోం రూల్ ఉద్యమంలో పాల్గొన్నారు. అదే స్ఫూర్తితో భారత్‌లో హోంరూల్ ఉద్యమానికి పునాదులు వేశారు.
స్వాతంత్య్రోద్యమానికి తొలితరం ప్రముఖ నాయకుడిగా ఉన్న తిలక్..కాకా ఆలోచనలను స్వీకరించారు. ఇద్దరూ సన్నిహితులుగా మారిపోయారు. 1894 లో మొదటిసారి మహారాష్ర్టలోని పుణేలో సార్వజనిక్ గణేష్ ఉత్సవాలను తిలక్ ప్రారంభించారు. ఈ బృహత్తర కార్యంలో తిలక్‌కు కాకా బాప్టిస్టా సహాయం చేశారు. 1925లో కాకా.. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఏడాది మాత్రమే కొనసాగారు.