సాధారణ గాంధీని మహాత్మునిగా మలిచింది ఆయన ఆచరణ. అయితే, ఆ ఆచరణకు ప్రేరణనిచ్చింది జాన్ రస్కిన్ రచన. ఓ ఆంగ్లేయుడు చిరు కానుకగా ఇచ్చిన పుస్తకం తెల్లారే సరికి గాంధీని మార్చివేసింది! ‘అన్టు దిస్ లాస్ట్’ చదవకముందు గాంధీ వేరు. చదివిన తర్వాత గాంధీ వేరు! ఒక రోజు గాంధీజీని రైలెక్కించేందుకు వచ్చిన జర్నలిస్ట్ పొలాక్.. ‘ఈ పుస్తకం చదువతగింది. మీకు నచ్చుతుంద’ని ‘అన్టు దిస్ లాస్ట్’ పుస్తకాన్ని చేతిలో పెట్టాడు. జొహాన్నెస్ బర్గ్ నుంచి రైలులో బయలుదేరారు గాంధీ. ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాక ఆపలేకపోయారు. ఆ రోజు ఆయనకు నిద్ర పట్టలేదు. ఆ పుస్తకంలో చదివిన విషయాల్ని ఆచరణలో పెట్టాలని ఆ రాత్రే నిర్ణయించుకున్నారు. రస్కిన్ రచన గాంధీ జీవితాన్ని మలుపు తిప్పింది. దీని ద్వారా మూడు విషయాలను తెలుసుకున్నారు. అందరికీ మేలు జరగడంలోనే తన మేలు ఇమిడి ఉంటుంది. జీవనోపాధి హక్కు అందరికీ సమానమే. కాబట్టి అన్ని వృత్తులను సమానంగా చూడాలి. నిరాడంబరంగా వుంటూ కష్టపడి పనిచేసే రైతు జీవనమే నిజమైన జీవితం. ‘ఈ మూడు భావాల్లోని మొదటిది నాకు తెలుసు. రెండోది కొంచెం తెలుసు. మూడో విషయం ఎన్నడూ ఊహించలేద’ని అంటారు గాంధీజీ. ‘ఆ భావాలు దీపంలా నాలో వెలుగుని ప్రసారం చేశాయి. సర్వోదయాన్ని నాకు బోధించాయి’ అని ఆత్మకథలో రాసుకున్నారు.