రైతుల హక్కుల కోసం ప్రస్తుతం దేశమంతటా పోరాటాలు నడుస్తున్నాయి. అయితే, అన్నదాతలకోసం స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఉద్యమాలు నడిపాడు మరాఠా ‘సేనాపతి’ పాండురంగ మహదేవ్ బాపట్. సామాన్యుడి జీవించే హక్కును హరిస్తున్న భారీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సత్యాగ్రహం నడిపి చరిత్రలో నిలిచిపోయాడు.
సేనాపతి బాపట్ బొంబాయి ఫ్రావిన్స్‌లోని పార్నేర్లో జన్మించాడు. ఉన్నత విద్య కోసం పుణెలోని దక్కన్ కాలేజీలో చేరాడు. అది ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ఏర్పడిన పరిచయాలు బాపట్లో విప్లవస్ఫూర్తిని రగిలించాయి. 1904లో ఎడిన్బర్గ్లో ఇంజినీరింగ్ చదివేందుకు వెళ్లినప్పుడు సావర్కర్ పరిచయమయ్యాడు. ఆయన సూచనతో బాంబు తయారీ నేర్చుకునేందుకు పారిస్ చేరుకున్నాడు. ఆ శిక్షణ పూర్తయ్యాక 1908లో ముం బైలో దిగాడు. తన దగ్గర శిక్షణ పొందినవాళ్లు అలీపూర్‌లో బాంబు దాడి జరిపారు. ఈ కేసులో 1912లో బాపట్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడేండ్ల జైలుశిక్ష తర్వాత తిలక్ యాజమాన్యంలో ని ‘మరాఠా’ పత్రికలో చేరాడు. ఆయన మరణానంతరం గాంధీ మార్గం పట్టాడు.
ఆనాడే ప్రాజెక్టు వ్యతిరేక పోరాటం
ప్రాజెక్టుల వల్ల నష్టపోయే సామాన్యుల హక్కులు కాపాడేందుకు బాపట్ పోరాటం జరిపాడు. టాటా జలవిద్యుత్ ప్రాజెక్ట్ వల్ల 50కిపైగా గ్రామాలు మునిగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. దాని నిర్మాణం నిలిపివేయాలని 1921లో ముల్షీ సత్యాగ్రహం నడిపాడు. రైతుల హక్కుల కోసం సుదీర్ఘకాలం పోరాటం చేశాడు. మూడుసార్లు జైలు పాలయ్యాడు. ఏడేండ్లు జైలులో ఉన్నాడు. జైలు శిక్ష ఆయనలోని పోరాట పటిమ ఇసుమంతైనా తగ్గించలేదు. విడుదలైన తర్వాత బాపట్లోని సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించిన మరాఠీలు రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ యోధుడిని ‘సేనాపతి’ అని మరాఠీ ప్రజలు గౌరవంగా పిలిచారు. బాపట్.. జైలులో ఎన్నో రచనలు చేశారు. స్వాతంత్య్రానంతర భారత తపాలా శాఖ ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.