ఇచ్చోడ, ఫిబ్రవరి 27: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షికి స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు. ముక్రా(కే) గ్రామా న్ని ఓడీఎఫ్ ప్లస్ మోడల్‌గా తీర్చిదిద్దడంలో సర్పంచ్ మీనాక్షి కీలకపాత్ర పోషించారని హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అభినందించారు.
తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక పంచాయతీగా ముక్రా(కే) నిలిచింది. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాల వల్లే తనకు ఈ పురస్కారం దక్కిందని తెలిపారు. పల్లె ప్రగతితోనే గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని పేర్కొన్నారు.