హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్మకానికి పెట్టాడా? ఎన్నికల్లో వారు చూపించిన అపార అభిమానాన్ని అచ్చంగా కాసులకు అమ్ముకొన్నాడా? తనకు రాజకీయంగా కనీ పెంచిన నల్లగొండ ప్రజల ఆదరణను కాంట్రాక్టుల కోసం బేరం పెట్టాడా? బయటపడుతున్న కొన్ని వివరాలు, విషయాలు ఇదే సంకేతాలిస్తున్నాయి. బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్, రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ మధ్య జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు పలు అనుమానాలకు
రేకెత్తిస్తున్నాయి. సుశీ ఇన్ఫ్రాకు కొంతకాలం క్రితం విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ‘ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్’ కింద రూ.25 కోట్లు బదిలీ అ య్యాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే భూమి కొ నుగోలు అడ్వాన్ పేరుతో విశాఖ నుంచి మరో రూ.59.95 కోట్లు బదిలీ అయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. అందుకు సంబంధించి అఫిడవిట్‌లోని 14వ పేరాను కే ప్రతీక్‌రెడ్డి అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయటంతో వైరల్‌గా మారింది. బీజేపీ కొనుగోలు చేసిన నేతల్లో రాజగోపాల్‌రెడ్డే అత్యంత ఖరీదైనవారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అనుమానం ఎందుకంటే..
గతంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సమయంలో జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.10 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌గా ఇస్తున్నట్టు, దీనికి 18 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్టు విశాఖ ఇండస్ట్రీస్ తన 2022 బ్యాలెన్స్ షీట్లో పేర్కొన్నది. అలాగే కార్పొరేట్ డిపాజిట్‌గా వ్యాపార కార్యకలాపాల నిమిత్తం సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌కు రూ.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీకి ఇచ్చినట్టు విశాఖ ఇండస్ట్రీస్ బ్యాలెన్స్ షీట్లో పొందుపరిచింది. తాజాగా రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో విశాఖ ఇండస్ట్రీస్‌కు అమ్మిన భూమికి సంబంధించిన అడ్వాన్స్‌గా రూ.59.95 కోట్లు చూపెట్టారు. దీనిని తాను తిరిగి చెల్లించాల్సిన (లయబిలిటీ) మొత్తంగా పేర్కొన్నారు. అయితే, ఈ రూ.59.95 కోట్ల లావాదేవీని విశాఖ ఇండస్ట్రీస్ తమ 2022 తన బ్యాలెన్స్ షీట్లో చూపకపోవటంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రతీక్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఈ లావాదేవీ రెండు కోణాల్లో జరిగే అవకాశం ఉన్నది. ఒకటి అధికారికంగా చెప్పకుండా దాచిపెట్టడం.. రెండోది ఈ అడ్వాన్స్‌ను 2023 ఆర్థిక సంవత్సరానిదిగా చూపించడం’ అని ట్వీట్ చేశారు. ఈ లావాదేవీలన్నీ సరైనవే అనుకున్నా.. వాటి వెనక ఉన్న ఉద్దేశాలు, నిర్వహించిన సమయం అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాంట్రాక్టుల కోసమే కమలం గూటికి
ఎక్కడో జార్ఖండ్‌లో రూ.18,000 కోట్ల ఓ భారీ మైనింగ్ ప్రాజెక్టు.. దానిని దక్కించుకొన్నది సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ. కట్‌చేస్తే తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి హ్యాండిచ్చి బీజేపీలో చేరిపోయారు. మునుగోడు ప్రజలపై బలవంతంగా ఉప ఎన్నిక రుద్దారు. రాజగోపాల్‌రెడ్డి కుమారుడికి చెందిన సుశీ ఇన్ఫ్రా జార్ఖండ్‌లో దక్కించుకొన్న చంద్రగుప్త ఓపెన్‌కాస్ట్ మైన్ విలువ రూ.21,956.64 కోట్లు. దీని కాంట్రాక్టు కూడా సుదీర్ఘంగా 25 ఏండ్లు. దీంతో ముందుముందు కూడా తన వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీర్ఘకాలిక వ్యూహంతోనే ఆయన బీజేపీలోకి వెళ్లారని పరిశీలకులు అంటున్నారు. ఎంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారైనా బీజేపీలో చేరితే, వారిపై ఈగ కూడా వాలదని ఇప్పటికే రుజువైంది. దీంతో తన వ్యాపారాలు సజావుగా చేసుకొనేందుకు బీజేపీలోకి వెళ్లటమే మంచిదని రాజగోపాల్‌రెడ్డి భావించి ఉంటారని రాజకీయ పండితులు అంటున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ను, రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌ను కూడా బద్నాంచేసి పోతే కొత్తపార్టీలో కాస్త గుర్తింపు అయినా దక్కుతుందని భావించారని విశ్లేషిస్తున్నారు.