పెన్పహాడ్/సూర్యాపేట టౌన్/బొడ్రాయిబజార్, జూలై 16: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లికి చెందిన కొంపల్లి సోమయ్య, స్వరూప దంపతుల చిన్న కూతురు సరస్వతి(10) పెన్పహాడ్ మండలం దోసపహాడ్ పూలే గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది. సరస్వతి సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నది. మంగళవారం జ్వరం ఎక్కువ కావడంతో జీఎన్ఎం, ఉపాధ్యాయురాలు ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందించినా జ్వరం తగ్గకపోవడంతో 108 ద్వారా సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించారు. చికిత్స అందించేలోపే సరస్వతి మృతిచెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సరస్వతి తల్లిదండ్రులు.. దవాఖానకు చేరుకొని విగతజీవిగా పడి ఉన్న తమ కూతురును చూసి భోరున విలపించారు. జతమ బిడ్డ మరణానికి పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై రవీందర్ తెలిపారు.
విద్యార్థిని సరస్వతి మరణంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మృతికి గల కారణాలపై విచారణ జరపాలని గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ సైదులును ఆదేశించారు. సరస్వతి కుటుంబానికి రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.