యాదగిరిగుట్ట, జూన్ 14: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నివాసంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎమ్మెల్యే స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురానికి చెందిన గంధమల్ల రవి (37) యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి నాలుగో అంతస్థులో ఉన్న రేకుల షెడ్డులో శాలువాతో ఉరివేసుకున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. సైదాపురానికి చెందిన గంధమల్ల రవి, అతడి భార్య నవిత, ఒక కూతురితో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో వంటతోపాటు ఇంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరో కూతురు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నది. కార ణం తెలియదు గానీ మనోవేదనకు గురైన రవి మద్యానికి బానిసయ్యాడు. నెల క్రితం మద్యం తాగి ఇంటికి వచ్చిన రవిని ఎమ్మె ల్యే భార్య మందలించినట్టు సమాచారం. మాటామాట పెరగడంతో ఎమ్మెల్యే అయిలయ్య.. రవిపై చెయ్యి చేసుకున్నాడని తెలుస్తున్నది. దీంతో అతడు నెల క్రితమే నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. అతడికి దవాఖానలో చికిత్స చేయించడంతో ప్రాణాలతో బయటపడినట్టు తెలిసింది.
రవి రెండురోజుల క్రితం సైదాపురంలోని సొంత ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ ఎవరూ ఉండరు. ఒకవేళ ఆత్మహత్యకు చేసుకోవాలని భావిస్తే సైదాపురంలోని ఇంట్లోనే పాల్పడేందుకు అవకాశం ఉన్నా.. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యే అయిలయ్య ఇంటికి వచ్చి మరీ ఉరివేసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నదని సైదాపురం గ్రామానికి చెందిన పలువురు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునే ఘట న కంటే ముందు ఏం జరిగింది? సొంతూ రు, ఇల్లు వదిలిపెట్టి ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చి ఎందుకు ఉరివేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని ఆ గ్రామానికి చెందిన ప్రజలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలావుండగా శుక్రవారం 10 గంటల సమయంలో ఉరివేసుకోగా ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని దవాఖానకు తరలించడం గమనార్హం.
ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్న రుణం కట్టే పరిస్థితి లేకనే మనస్తాపానికి గురై గంధమల్ల రవి ఆత్మహత్యకు పాల్పడినట్టు సీఐ భాస్కర్ తెలిపారు. బ్యాం కు సిబ్బంది లీగల్ నోటీసులు జారీ చేశారని, ఇంటికి వచ్చి తాళంవేస్తామని, ఇంటికి నోటీసులు అతికించి బెదిరించడంతో 15 రోజులుగా మద్యం తాగుతూ ఉన్నాడని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో పనిచేసే గంధమల్ల రవి ఆత్మహత్య హైదరాబాద్ మంత్రుల నివాసంలోని అయిలయ్య ఉంటున్న క్వార్టర్ నంబర్-28లో జరిగినట్టు అనుమానంగా ఉన్నదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బ్యాంకు రుణం కట్టలేక, ఆర్థిక ఇబ్బందులతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నడు. మా స్వగ్రామం సైదాపురంలోనూ అప్పు లు చేశాడు. అందరూ కలిసి చేసిన అప్పు కట్టాలని మా ఆయనపై ఒత్తిడి చేశారు. శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటిపైన రేకుల షెడ్డు వద్దకు వెళ్లాడు. సుమారు 9:30 గంటలకు ఫోన్ చేస్తే ఎత్తలేదు. భయం వేసి రేకుల షెడ్డు వద్దకు వెళ్లి చూస్తే శాలువాతో ఉరి వేసుకుని కనిపించాడు. కిందికి వచ్చి ఎమ్మెల్యే, ఆయన గన్మెన్లకు చెప్పాను. వా ళ్లు వచ్చి చనిపోయిన నా భర్తను కిందికి దిం చి భువనగిరి దవాఖానకు తరలించారు.
-గంధమల్ల నవిత, మృతుడి భార్య
గంధమల్ల రవి నా ఇంటి మనిషి. మా ఇంట్లో ఒక సభ్యుడిగా తిరిగాడు. అతను ఇలా ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. గతంలో మద్యానికి బానిసైన విషయం తెలిసి మందలించిన. మద్యం తాగి ఇంట్లో ఉంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చిన. బ్యాంకు రుణంతోపాటు అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ప్రతిపక్ష నాయకులు నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ, నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. రవి మరణంపై అనుమానాలు ఉంటే మా ఇంట్లోని సీసీ ఫుటేజీలను చెక్ చేసుకోవచ్చు.
-బీర్ల అయిలయ్య
సొంత ఇంట్లోనే ఆత్మహత్యను ఆపలేకపోయిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.. ఆలేరు నియోజకవర్గ ప్రజలను ఎలా కాపాడుతాడో చెప్పాలి? ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంట్లో పనిచేసే వ్యక్తి రవి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలి. మృతుడి కుటుంబానికి అన్నివిధాలుగా న్యాయం చేయాలి.
– గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే