ఖానాపూర్ టౌన్, ఆగస్టు 10: నిర్మల్ జిల్లా ఖానాపూర్ సామాజిక దవాఖానలో కాలం చెల్లిన స్లైన్ ఎక్కించిన ఘటనలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు ఐదుగురు సిబ్బందికి మెమోలు జారీ చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘రోగికి గడువు తీరిన స్లైన్’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వార్త ప్రచురితమైంది.
ఇందుకు స్పందించిన కలెక్టర్.. ఘటనపై విచారణ చేపట్టాలని డీఎంహెచ్‌వో రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేశ్‌ను ఆదేశించారు. నివేదిక ఆధారంగా ఫార్మసిస్టు సునీత, స్టాఫ్‌నర్సు చంద్రకళను విధుల నుంచి తొలగించినట్టు తెలిపారు. దవాఖాన పర్యవేక్షకుడు వంశీ, ఫార్మసిస్టులు శ్రీనివాసాచారి, విజయ్‌కుమార్, వెంకటేశ్, కల్యాణిలకు మెమోలు జారీ చేసినట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ దవాఖానల నిర్వహణ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకుఅందించేందుకు కమిటీలు ఏర్పాటుచేస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.
కాచిగూడ, ఆగస్టు 10: తెలంగాణలో కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్ని గుండమే అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం హెచ్చరించారు. హైదరాబాద్ శనివారం బీసీ సంఘాలు, కుల సంఘాలతో ఏర్పాటైన సమావేశంలో సత్యం మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆనాడు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జీ మల్లేశ్‌యాదవ్, నందగోపాల్, రామకృష్ణ, ఉదయ్‌నేత తదితరులు పాల్గొన్నారు.