yennam srinivas reddy | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, సెప్టెంబర్ 5, (నమస్తే తెలంగాణ):కాంగ్రెస్‌కు బీ-టీమ్ అని బీజేపీ, బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ పార్టీలు భారత రాష్ట్ర సమితిపై బురదజల్లుతుంటాయి. కానీ వాస్తవానికి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక చీకట్లో ఏ విధంగా చేతులు కలుపుతున్నాయో మంగళవారం బయటపడింది. బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఈ రెండు పార్టీల మధ్యనున్న లోపాయికారీ బంధాన్ని బయటపెట్టారు. సీఎం కేసీఆర్‌ను దెబ్బతీయడం ఒక్కటే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు ఏ విధంగా కుట్రలు పన్నుతున్నదీ యెన్నం పూసగుచ్చినట్టు మీడియాకు వివరించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య సమిష్టిగా ఎన్నో మీటింగ్‌లు జరిగినట్టు వెల్లడించారు. ‘మాతో (బీజేపీ) కాంగ్రెస్ వాళ్లు కూడా సంపర్కంలోకి వచ్చిండ్రు..ఈటల రాజేందర్‌తో వచ్చిండ్రు, నాతో (యెన్నం) వచ్చిండ్రు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో వచ్చిండ్రు’ అని చెప్పారు. ‘తెలంగాణలో కేసీఆర్‌ను కొట్టాలంటే మీ అందరి సహకారం కావాలని ఆ రోజు బీజేపీ ఎట్ల అడిగిందో, ఈ రోజు కాంగ్రెస్ వాళ్లు అట్ల అడిగిండ్రు’ అని యెన్నం వివరించారు. ‘ఈటల రాజేందర్, వివేక్, రాజగోపాల్‌రెడ్డి, రవీంద్ర నాయక్.. గతంలో అందరం కలిసి కాంగ్రెస్‌తో చర్చలు జరుపడం మరిచిపోయారా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇప్పుడు తనతో కూడా సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు.
సీఎం కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌లు చీకట్లో ఏ విధంగా చేతులు కలిపింది ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్-బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో వైరం ఉన్నట్టు కనిపిస్తున్నా అవి రెండు రాష్ట్రంలో కేసీఆర్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నాయని యెన్నం చెప్పిన మాటలతో రుజువు అయింది. ఈ విషయాన్ని గ్రహించే సీఎం కేసీఆర్, ఈ రెండు పార్టీలతో కలువకుండా సమదూరం పాటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ను అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ గానీ ఒంటరిగా ఎదుర్కొలేమని గ్రహించి చీకట్లో చేతులు కలుపుతున్న విషయాన్ని యెన్నం పరోక్షంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పాలనా పరంగా విఫలమైతే అధికార పక్షాన్ని గద్దె దింపాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలు పనిచేస్తాయి. కానీ ప్రజలలో కేసీఆర్కున్న ప్రతిష్ఠ, బీఆర్ఎస్కున్న బలాన్ని ఎదుర్కోలేక వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్‌ను దెబ్బతీసే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలపడం ఏమిటి? ఇదెక్కడి దిక్కుమాలిన వైఖరి అని ప్రజలు, తెలంగాణవాదులు ఈ పార్టీలను నిలదీస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కీలక సమయంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకశక్తుల చేతిలో ఏ విధంగా పావుగా మారిన విషయాన్ని కూడా యెన్నం బయటపెట్టడం రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీకి మింగుడుపడని అంశం.