న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మంత్రులు, సివిల్ సర్వెంట్ల తరహాలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏటా తమ ఆస్తులను ప్రకటించడాన్ని తప్పనిసరి చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ సోమవారం రాజ్యసభలో డిమాండ్‌చేశారు. దీని అమలుకు ప్రస్తుతం ఉన్న చట్టాన్ని సవరించాలని లేదా కొత్త చట్టాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రిసహా మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వెంట్లు ప్రతిఏటా తమ ఆస్తులను ప్రకటిస్తారని చెప్పారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థుల ఆస్తులను తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని, ఆ మేరకు అభ్యర్థులు ఆస్తుల అఫిడవిట్లు సమర్పిస్తుంటారని గుర్తుచేశారు. న్యాయమూర్తులు అందరూ తమ ఆస్తులను తప్పనిసరిగా వెల్లడించాలని 1997 మేలో సుప్రీంకోర్టు ఆదేశించిందని, అనంతరం మరో ఫుల్‌బెంచ్ దానిని స్వచ్చందంగా (వలంటరీగా) మార్చిందని తెలిపారు.