సూర్యాపేట : బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ బుధవారం రాత్రి వీఆర్‌కి బదిలీ అయ్యారు. ఆయన శుక్రవారం రిలీవ్ అయిపోయి హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ గురువారం మధ్యాహ్నమే అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు.
సూర్యాపేట మండల పరిధిలోని రాజుగారి తోట హోటల్ యాజమాన్యం నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వీఆర్‌కు వెళ్తూ కూడా ఎస్ఐ అవినీతికి పాల్పడటం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. బాధితుడి కథనం మేరకు.. గత కొన్ని రోజులుగా ఎస్ఐ లవ కుమార్ హోటల్ యాజమాన్యాన్ని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ హోటల్ సజావుగా సాగాలంటే లక్షన్నర రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో 1.3 లక్షల రూపాయలను తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.