సూర్యాపేట, జనవరి 3: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ మ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అధికారం చేపట్టిన కొద్దిరోజులకే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, రెండేండ్లలో ఆ వ్య తిరేకత తీవ్రస్థాయికి చేరిందని పేర్కొన్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన అద్భుత ఫలితాలే నిదర్శనమని అన్నారు. శనివారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ నాయకత్వమే బాగుండేనని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నట్టు తెలిపారు. పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జ రిగినా అత్యధిక సీట్లు సాధించుకున్నట్టు చె ప్పారు. ఇక గుర్తులపై జరిగే ఎన్నికలైతే కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ సైనికులు మరింత ఉత్సాహంగా పనిచేస్తే మున్సిపల్ ఎన్నికలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని సూచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయామని తెలుసుకున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.