Suryapet |తాగునీటికి కటకట. అందనంత దూరంలో సర్కారు విద్యా, వైద్యం. మౌలిక వసతులు హీనం. ఇది 2014కు ముందు సూర్యాపేట నియోజకవర్గ పరిస్థితి. వరుసగా మూడుసార్లు గెలిచి సూర్యాపేటను ఆగం పట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఐదేండ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన సూర్యాపేట అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం రావడం, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రిగా అవకాశం రావడంతో ఈ నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం అయ్యింది. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ఐటీ హబ్‌లు చకచకా నిర్మించారు. సాగు, తాగునీటి కోసం అనేక నిధులు కేటాయించారు. ప్రజా సమస్యలన్నీ తీర్చారు. ఈ పదేండ్ల కాలంలో రూపురేఖలు మారాయి.
సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు అన్ని పార్టీలనూ ఆదరించారు. మొదట కమ్యూనిస్టులకు, ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టం కట్టారు. అన్ని పార్టీలకు సూర్యాపేటలో స్థానం దక్కింది కానీ ఇక్కడి అభివృద్ధికి మాత్రం ఏ పార్టీ అజెండాలోనూ చోటు దక్కలేదు. ఆ పార్టీల ఎమ్మెల్యేలు అరవై ఏండ్లు పాలించి అభివృద్ధిని దూరం చేశారు. ఈ నియోజకవర్గాన్ని ఆగం పట్టిచ్చిన ఘనత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీది. అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయలేని అసమర్థత దామోదర్‌రెడ్డిది. కాంగ్రెస్‌ను నమ్మి విసిగిపోయిన సూర్యాపేట ప్రజలు 2014లో మొదటిసారి బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని గెలిపించారు. ఈ గెలుపు అభివృద్ధికి మలుపయ్యింది. మంత్రిగా అవకాశం రావడం మరింత తోడ్పాటు అయ్యింది. పదేండ్లలోనే అబ్బురపడే రీతిలో సాధించిన ప్రగతికి సాక్షిగా సూర్యాపేట నిలుస్తున్నది.
జగదీశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక సూర్యాపేటకు భారీగా నిధులు తీసుకొచ్చారు. పదేండ్ల కాలంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.7,500 కోట్లు ఖర్చు చేయించారంటే అభివృద్ధి ఎంతగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూర్యాపేట సమస్యలపై ఉన్న అవగాహనతో అదనంగా నిధులు కేటాయించారు. కేసీఆర్‌తో జగదీశ్‌రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం కూడా ఇందుకు ఉపయోగపడింది. ప్రభుత్వం సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో ఇక్కడి ప్రజలకు పాలన మరింత చేరువైంది. తొలి దఫాలోనే సూర్యాపేటలో కేసీఆర్ ప్రభుత్వం మెడికల్ కాలేజీని నిర్మించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి కృషితో సూర్యాపేట పట్టణం మాడల్ టౌన్‌గా అభివృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక అభివృద్ధి పనులు జరిగాయి.
☞ సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ఐటీ హబ్ నిర్మాణం.
☞ ఉదయ సముద్రం నుంచి మూసీ వరకు కాల్వ తవ్వించి కృష్ణా నీటిని తేవడంతో తాగునీటి సమస్యకు పరిష్కారం.
☞ మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ, 23 చెక్ డ్యాంల నిర్మాణం, 1,120 చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు, లిఫ్ట్‌ల మరమ్మతులతో తీరిన సాగునీటి కొరత.
☞ సూర్యాపేట పట్టణంలో రెండు మినీ ట్యాంక్బండ్ల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 52 పార్కులు, ఓపెన్ జిమ్‌లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం.
☞ పట్టణంలో రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు. స్టేడియం, కళాభారతి నిర్మాణం.
☞ నర్సింగ్ కళాశాల, 600 పడకల దవాఖాన, మాతా శిశు కేంద్రం నిర్మాణం, ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు.
☞ గ్రామాల నుంచి మండల కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం.
☞ మహాప్రస్థానం, అద్దె ఇంట్లో ఎవరైనా చనిపోతే కార్యక్రమాలు పూర్తయ్యే వరకు వారి కుటుంబం ఉండేందుకు వసతి భవన నిర్మాణం.
☞ రూ.15 కోట్లతో పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ అభివృద్ధి, వేంకటేశ్వరస్వామి ఆలయం, నెమ్మికల్ దండుమైసమ్మ, గాంధీనగర్ పెద్దమ్మ ఆలయాల పునర్నిర్మాణం.
☞ శ్రీరాంసాగర్ కాలువపై పెన్‌పహాడ్ మండలం భక్తళాపురం వద్ద నిలిచిపోయిన టన్నెల్ పూర్తి.
☞ సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రూ.300 కోట్లు మంజూరు.