గద్వాల, జూన్ 25 : ‘తన కుమారుడు తేజేశ్వర్‌ను కోడలు ఐశ్వర్య మాయమాటలతో నమ్మించింది.. నిశ్చితార్థమైన తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి పెట్టుకున్నాం. వివాహానికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.. విషయం తెలుసుకొని వేడుక రద్దు చేసుకున్నాం.. తర్వాత వచ్చిన ఐశ్వర్య మా బిడ్డకు మోసపు మాటలు చెప్పి నమ్మించింది. పెండ్లి మాకు ఇష్టం లేదు.. వద్దని చెప్పాం.. అయినా వినకుండా ఆ మాయలాడి మాటలు నమ్మి పెండ్లి చేసుకున్నాడు.
మా బిడ్డ మా మాట విని ఉంటే బతికేవాడేమో’.. అంటూ తేజేశ్వర్ తల్లిదండ్రులు శకుంతల-జయరాములు కన్నీరుమున్నీరయ్యారు. కోడలి కుటుంబమంతా నటన బ్యాచ్.. వారి నటనలో తన కుమారుడు మోసపోయి గోస మిగిల్చాడని తండ్రి వాపోయాడు. తాము చెప్పినట్టు వినిఉంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చేదికాదని రోదించాడు. పోలీసులు నిందితులకు శిక్ష పడేలాచూడాలని కోరాడు. సంసారం చేయడం ఇష్టం లేకపోతే వెళ్లి పోవాల్సిందని.. చంపాల్సిన అవసరం ఏముందని తేజేశ్వర్ సోదరి రమాదేవి ప్రశ్నించింది. అఘాయిత్యానికి పాల్పడిన ఐశ్వర్యతోపాటు నిందితులను ఉరి తీయాలి.. అప్పుడే తమ కుటుంబానికి మనశ్శాంతి అని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన విచారణ వేగంగా కొనసాగుతున్నది. హత్యకు సుపారీ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును పట్టుకునేందుకు అతడి స్నేహితులతోపాటు బంధువులను పోలీసులు ఆరాతీశారు. మూడురోజులుగా హైదరాబాద్‌లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. రెక్కీ నిర్వహించి ఎట్టకేలకు అతడిని బుధవారం అదుపులోకి తీసుకొని గద్వాలకు తీసుకొచ్చి విచారించినట్టు సమాచారం. తిరుమలరావు బ్యాంకులో పెద్ద ఎత్తున డబ్బులు డ్రా చేసుకొని విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపీలోని కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలుసుకొన్నారు.