హాజీపూర్, జూన్ 4 : భూమి సర్వే చేయడం కోసం లంచం తీసుకున్న మంచిర్యాల మండల సర్వేయర్ మంజులతోపాటు చైన్‌మెన్ ఉదయ్‌ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ భూమిని సర్వే చేయడం కోసం ఓ వ్యక్తి సర్వేయర్ మంజులను కలిశాడు. ఇందుకు ఆమె రూ. 50 వేలు డిమాండ్ చేసింది. ఒప్పందం ప్రకారం బాధితుడు ఇటీవల రూ. 16,500 చైన్‌మెన్ ఉదయ్‌కి ఫోన్‌పే చేశాడు.
ఆపై రూ.10 వేలు నగదు ఇచ్చాడు. ఈ క్రమంలో సర్వే విషయమై మళ్లీ తహసీల్ కార్యాలయానికి వెళ్లి కలువగా, సర్వేయర్‌తోపాటు చైన్‌మెన్ మరో రూ. 30 వేలు ఇవ్వాలని బాధితుడిపై ఒత్తిడి తెచ్చారు. చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని, గురువారం ఉదయం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఉద్యానశాఖలో సిబ్బంది కరువు ; పంటల విస్తరణపై తీవ్ర ప్రభావం
హైదరాబాద్, జూన్ 4 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో ఉద్యాన పంటల విస్తరణ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 8వేల ఎకరాల్లో ఉద్యానపంటలు సాగవుతున్నాయి. దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో నెలకొన్న ఆహార కొరతను తీర్చడంలో ఉద్యానపంటలు కీలక పాత్రపోషిస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యాన పంటలకు ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. ఉపాధి హామీ పథకంతో పాటు వివిధ సబ్సిడీల కింద బడ్జెట్లను కేటాయించాయి. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. రాష్ట్రంలో మళ్లీ క్షేత్రస్థాయి హార్టికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ల నియామకం తెరపైకి వచ్చింది. దాదాపు 3వేల మంది హార్టికల్చర్ కోర్సు పూర్తిచేసి ఉపాధి లేక ఖాళీగా ఉన్నారని చెబుతున్నారు. వీరిని నియమిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వారు కోరుతున్నారు.