ఖానాపురం, ఏప్రిల్ 15 : వడగండ్ల వానకు జరిగిన పంట నష్టంపై వెంటనే సర్వే చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అకాల వర్షానికి పాకాల ఆయకట్టులో వరి, మక్క పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన పంటల సర్వే చేపట్టాలని వ్యవసాయ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు తక్షణమే పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.25వేల ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని కోరారు. ఎస్సై రఘుపతి సిబ్బందితో చేరుకుని తహసీల్దార్ కిరణ్‌తో ఫోన్లో మాట్లాడించారు.
రేపటి నుంచే సర్వే చేయిస్తామన్న తహసీల్దార్ హామీతో రైతులు రాస్తారోకో విరమించారు.