సంగారెడ్డి జూన్ 3 (నమస్తే తెలంగాణ): సింగూరు ముంపు భూములను ఆక్రమించుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమ్మర్దికే జీ హుజూర్ అంటున్నారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్‌లో సింగూరు ముంపు భూముల్లో 200 ఎకరాలపై కన్నేసిన కాంగ్రెస్ మంత్రి బామ్మర్ది వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఆయన చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. సింగూరు ముంపు భూముల ఆక్రమణల మీద ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన భూమ్మర్తి కథనంపై స్పందించిన కలెక్టర్ ప్రతీక్‌జైన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూశాఖ నుంచి ఆర్డీవో, ఇరిగేషన్‌శాఖ నుంచి డీఈ స్థాయి అధికారులు ముంపు భూములను పరిశీలించి సర్వే చేపట్టాల్సి ఉంది.
అయితే ఉన్నతాధికారులు ఎవ్వరూ సంయుక్తంగా సర్వే నిర్వహించేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. కేవలం వట్పల్లి తహసీల్దార్ జంగేశ్వర్, ఇరిగేషన్‌శాఖకు చెందిన ఏఈఈలు యాదయ్య, నవీన్, జగన్నాథ్, సర్వేయర్ మురళీధర్ మాత్రమే బుధవారం ఖాదిరాబాద్, సాయిపేట గ్రామాల పరిధిలోని సింగూరు ముంపు భూములను సందర్శించారు. అంతకుముందు తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో ఆయనను కలిశారు. అధికారులతోపాటు ముంపు భూముల వద్దకు బయల్దేరిన ఆ బామ్మర్ది మీడియా ప్రతినిధులను చూసి తిరిగి ఫాంహౌస్‌లోకి వెళ్లిపోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు. అయితే సర్వే ప్రారంభానికి ముందు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మరోమారు ఆ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లోకి వెళ్లారు. ముంపుభూముల గురించి చర్చించిన అధికారులు ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసినట్టు సమాచారం. దీనిపై స్థానికులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపుభూముల ఆక్రమణలపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నివాసంలోనే భోజనం చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా మంత్రి భయంతోనే అధికారులు ఆయన బామ్మర్దికి జీ హుజూర్ అంటున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
200 ఎకరాలపై ఆరోపణలు..సర్వే చేసింది 14 ఎకరాలు
ఖాదిరాబాద్, సాయిపేట గ్రామ శివారులో 200 ఎకరాలను మంత్రి బామ్మర్ది అక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఇందులో వట్పల్లి తహసీల్దార్ జంగేశ్వర్, ఇరిగేషన్ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. సింగూరు ముంపు భూములను చదును చేసిన ప్రాంతాలతోపాటు కొరివికుంట, నల్లకుంట కట్టలను తవ్విన ప్రాంతాన్ని, ఆలయం నిర్మాణం కోసం చదును చేసిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. అలాగే ముంపుభూముల్లోని మట్టికుప్పలు, బండరాళ్లు వేసిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ను గుర్తించేందుకు వీలుగా కబ్జాదారులు బండరాళ్లపై వేసిన గుర్తులను అధికారులు పరిశీలించారు.
రెండు కుంటలు మాయం!
ముంపుభూముల్లోని 200 ఎకరాల భూమిని ఆక్రమించుకోవటంతోపాటు రెండు కుంటలను నామరూపాలు లేకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు మాత్రం 14.013 ఎకరాల్లో మాత్రమే సర్వే నిర్వహించారు. సింగూరు ముంపు భూముల్లో ఆక్రమణకు గురైనట్టు ఆరోపణలు ఉన్న పెద్ద చెరువు ప్రాంతాన్ని సర్వే చేసినట్టు వట్పల్లి తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ముంపుభూముల్లోని కొరివికుంట, నల్లకుంటలను పూర్తిగా ధ్వంసం చేయటం, సింగూరు ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్‌ను తొలగించటంపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారుల తీరుపై ఖాదిరాబాద్, సాయిపేట గ్రామ రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి భయంతోనే అధికారులు మొత్తం ముంపుభూములు, కుంటలను తొలగించిన ప్రాంతాల్లో సర్వే చేయటంలేదని రైతులు అంటున్నారు. సింగూరు ముంపుభూములపై ఉన్నతాధికారులు నిష్పక్షవిచారణ చేపట్టడంతోపాటు భూములు ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గురువారం మరోమారు ముంపుభూములను పరిశీలించి సర్వే నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.