శంషాబాద్ రూరల్, మే 2 : ‘పేదోళ్ల ఇండ్లు ఢమాల్… పెద్దోళ్లకు సలామ్’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడ సర్వే నంబర్ 54లో ప్రభుత్వానికి చెందిన 52 ఎకరాలకు సంబంధించి పూర్తి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో శంషాబాద్ రెవెన్యూ అధికారులు శుక్రవారం సర్వేయర్‌తో కలిసి కొత్వాల్‌గూడ సర్వే నంబర్ 54లోని 52 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ప్రత్యేకంగా మ్యాప్ తయారు చేస్తామని వివరించారు. రెండురోజుల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని శంషాబాద్ తహసీల్దార్ రవీందర్దత్ తెలిపారు.
హిమాయత్‌సాగర్ నిర్మించిన సమయంలో భూమి కోల్పోయిన రాజేంద్రనగర్ మండలం హిమాయత్‌సాగర్ గ్రామానికి చెందిన పసుపుల గాలయ్య అనే వ్యక్తికి నష్టపరిహారం కింద సర్వే నంబర్ 54లోని 52 ఎకరాల భూమిని ఇచ్చిన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడాలేదు. అప్పటి ప్రభుత్వం ఇతర మార్గాల ద్వారా గాలయ్యకు నష్టపరిహారం ఇచ్చిన్నట్టు రికార్డుల్లో ఉన్నది. కానీ సదరు వ్యక్తి వారసులు మాత్రం ఇదే భూమిని తమకు ఇచ్చినట్టుగా పేర్కొంటూ ప్రైవేటు వ్యక్తికి అమ్మేశారు. దీంతో ఈ భూమి వివాదంలోకి చేరింది. ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఈ భూమిని కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తి అందులో వెంచర్ వేసి 52 ఎకరాల భూమిని 26 మందికి అమ్మేశాడు. ఈ భూమిలో తమకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని 2006లో రెవెన్యూ అధికారులను వీరు ఆశ్రయించారు.
రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అధికారులు పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందుకు తిరస్కరించారు. దీంతో వారు రెండో అదనపు జూనియర్ సివిల్ కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకొన్నారు. మరికొందరు నిర్మాణాలు చేసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ కోర్టులో అప్పీలుకు వెళ్లింది. 2018లో రంగారెడ్డి జిల్లా కోర్టులో దాదాపు 20 వరకు దావాలు దాఖలయ్యాయి. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ భూమి పూర్తిగా ప్రభుత్వానికి చెందినదని గత డిసెంబర్ 3న తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా మ్యాప్ తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి, వారి ఆదేశాలతో 52 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేస్తామని అధికారులు తెలిపారు.