Bhubharati | హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ) : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతిని రెఫరెండంగా భావిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ భారతితో భూ వివాదాల్లేని తెలంగాణ చూస్తామన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంతోపాటు పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మంత్రి పొంగులేటి భూభారతికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయబోతున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించిన తర్వాత జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నట్టు తెలిపారు.
ఇక భూ రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తామని, ఇందుకోసం కొత్తగా 6 వేల మంది ప్రైవేటు సర్వేయర్లను నియమించి శిక్షణ ఇస్తామని చెప్పారు. సర్వేకు సంబంధించిన చార్జీలు రైతులే భరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక భూ సమస్యల పరిష్కార బాధ్యతను తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు అప్పగిస్తామని, అవసరమైతే ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు. భూ రికార్డులను పరిరక్షించడం, వాటిపై రిపోర్ట్ ఇచ్చే బాధ్యతను మాత్రమే గ్రామ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. రికార్డుల్లో మార్పులు చేర్పులపై వీరికి అధికారం ఉండబోదని స్పష్టంచేశారు. రికార్డులను రాయగలిగేవారినే జీపీవోలుగా నియమిస్తామని, ధరణిలో అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని తెలిపారు. మనుషులకు ఆధార్ మాదిరిగా భూమికి భూదార్‌ను తీసుకొస్తామన్నారు. భూభారతి అమల్లోకి వచ్చినందున తక్షణమే కొత్త పాస్ పుస్తకాల అవసరం ఉండదని చెప్పారు. ఎన్ఐసీ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలగకుండా భూభారతిని అమలుచేస్తామని స్పష్టంచేశారు.
పైలట్ ప్రాజెక్ట్ మండలాలు ఇవే..
భూభారతి పోర్టల్‌ను సోమవారం శిల్పకళావేదికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనుండగా, తొలుత మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలుచేయనున్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్), రంగారెడ్డి జిల్లా కీసర, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.