హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఐ బ్యాంకులు, ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్లపై అధికారులు నిఘా పెంచనున్నారు. కొత్త కేంద్రాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఐ బ్యాంకులు, ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్లు, నేత్రదాన ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీ శుక్రవారం తొలిసారి సమావేశమైంది. దీనికి కమిటీ చైర్మన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు నేతృత్వం వహించారు. నేత్రదానంపై మరింత అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం వాటికి అనుబంధంగా ఐ బ్యాంకుల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలోని ఐ బ్యాంకులు, ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ల ద్వారా కార్నియా సేకరణ, సరఫరా, సర్జరీలు ఎలా జరుగుతున్నాయో చర్చించుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 39 ఐ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో రెండు ప్రభుత్వానివి. 52 ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్లు ఉన్నాయి. ఐ బ్యాంకులు నేత్ర దానం చేసినవారి నుంచి కార్నియాను సేకరిస్తే.. ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్లలో సర్జరీలు నిర్వహిస్తారు.