హైదరాబాద్: మనం అధికారంలో ఉన్నామా లేకా ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ తెలంగాణ కాంగ్రెస్ (Congress) సోషల్ మీడియా వింగ్ తీరుపై ఆ పార్టీ జాతీయ సోషల్ మీడియా చైర్పర్సన్ సుప్రియ శ్రీనేట్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్వాన్నంగా తయారైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతున్నదని, అయినా మీరు ఏం చేస్తున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీదే హవా కనిపిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడి పోయిందని విమర్శించారు. నిధులకు కొరత లేనప్పటికీ ఉదాసీనత ఎందుకంటూ తలంటారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా సదస్సుకు ఆమె ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడంలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యులు సతీశ్ మన్నె, నవీన్ పెట్టెంపై విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన నిర్వాకం చాలుగానీ.. ఇక మీవల్ల కాదంటూ మండిపడ్డారు. ఇకపై రాష్ట్ర పార్టీకి చెందిన ముఖ్యమైన సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ ఢిల్లీ నుంచి తామే చూసుకుంటామని తెగేసి చెప్పినట్లు తెలుస్తున్నది. దీనికోసం ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీని కూడా దించబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే ఒక యువ మహిళా కాంగ్రెస్ నేతకు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.