ఢిల్లీ, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్‌పై ఈడీ ఎలాంటి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించామంటేనే ఈడీ సమన్లు జారీ చేయవద్దని అర్థమని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ఉద్దేశించి ధర్మాసనం పేర్కొన్నది.
ఈడీది అధికార దుర్వినియోగం
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తొలుత విచారించింది. తన భార్యను ఈడీ ఆఫీసుకు పిలవడంపై అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ, వారం పది రోజుల గడువుతో నోటీసు జారీ చేయకుండా ఈడీ నేరుగా లుక్ ఔట్ నోటీసు ఇవ్వటమేమిటని ప్రశ్నించింది. దీంతో ఆ లుక్అవుట్ నోటీసును వెనకి తీసుకొంటామని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇదే సమయంలో కవిత తరఫు న్యాయవాది కల్పించుకొని తమ పిటిషనర్‌ను కూడా ఈడీ నిబంధనలకు విరుద్ధంగా విచారిస్తున్నదని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 160కు విరుద్ధంగా మహిళలను ఈడీ తమ కార్యాలయానికి పిలిచి విచారణ చేయడంపై తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. కవితను ఈడీ తన కార్యాలయానికి పిలిచి సాయంత్రం 5 గంటలు దాటినా విచారించిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కవిత ఆధార్ నంబర్‌తో లింక్ అయిన ఆమె ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారని, చట్టవిరుద్ధంగా ఆధార్ వివరాలు సేకరించడం జస్టిస్ పుట్టుస్వామి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని వాదించారు. ఈడీ చర్య తన పిటిషనర్ వ్యక్తిగత గోప్యత హకులకు భంగం కలిగించినట్టేనని పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో కవితపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. దీంతో పిటిషన్‌లోని 2 ప్రధాన అంశాలపై విచారణ జరిపి ఉత్తర్వులిస్తామని, అప్పటివరకు పిటిషనర్‌పై చర్యలు తీసుకోరాదని ఈడీని కోర్టు ఆదేశించింది. కవిత, నళిని చిదంబరం, అభిషేక్ పిటిషన్లను కలిపి విచారిస్తామని ప్రకటించింది. ఈ పిటిషన్లల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.
కవిత పిటిషన్‌లోని అంశాలివీ..
‘ఈడీ విచారణపై స్టే ఇవ్వాలి. ఈడీ కావాలనే నన్ను ఇరికించింది. సీబీఐ దర్యాప్తునకు ఈడీ విచారణకు తేడా లేదు. మద్యం కేసు ఎఫ్ఐఆర్లో నా పేరు లేనప్పుడు ఈడీ తన ఆఫీసుకు పిలిచి విచారించటం చట్టవిరుద్ధం. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో రాత్రి 8 గంటలు దాటాక కూడా నన్ను విచారించటం చట్ట వ్యతిరేకం. నేను నిందితురాలు కానప్పుడు విచారణకు రావాలని ఈడీ సమన్లు ఎలా జారీ చేస్తుంది? మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించే విషయంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను గమనంలోకి తీసుకోవాలి. మహిళలను ఇండ్ల వద్దే విచారించాలన్న సుప్రీం మార్గదర్శలకు ఈడీ కట్టుబడేలా ఆదేశాలివ్వాలి. ఢిల్లీలోని నా కార్యాలయంలోనే ఈడీ విచారణకు ఉత్తర్వులివ్వాలి. లేనిపక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్యాప్తునకు ఉత్తర్వులు ఇస్తే వసతులు కల్పిస్తాం. ఈ వ్యవహారంపై తుది ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈడీ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50 (2), 50 (3) ప్రకారం విచారణకు హాజరుపై స్టే ఇవ్వాలి. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 15 ఏండ్లలోపు, 50 ఏండ్ల పైబడిన పురుషులు, వయసుతో సంబంధం లేకుండా మహిళలు, మానసిక వైకల్యం ఉన్నవారిని ఇండ్ల వద్దే విచారించాలన్న మార్గదర్శకాలను సీబీఐ అమలు చేసింది. ఈడీ మాత్రం ఉల్లంఘించింది. మహిళలను ఇంట్లో విచారించాలా? ఆఫీసులో విచారించాలా? అనేది తేల్చాలి’ అని కవిత సుప్రీంకోర్టును కోరారు.