హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ (Phone taping) కేసులో విచారణకు మాజీ ఐపీఎస్ అధికారి (IPS officer) ప్రభాకరరావు (Prabharker Rao) ఏమాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) కు తెలిపింది. కేసు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్ర, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు.
అయితే ఎన్నిసార్లు పిలిచినా తన క్లయింట్ దర్యాప్తునకు హాజరైనట్లు ప్రభాకరరావు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు కోర్టుకు వెల్లడించారు. ఇదిలావుంటే ప్రభాకర్‌రావు ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు టాంపరింగ్ చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది లూత్ర చెప్పారు. డేటా రికవరీ చేయడానికి కూడా సహకరించడం లేదని తెలిపారు. తాను స్వయంగా వచ్చి కేసు వివరాలు అన్ని చెప్తానని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు పాస్ ఓవర్ ఇవ్వాలని కోరారు.
మరోవైపు ప్రభాకరరావు ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్‌టాప్ కూడా అదే స్థితిలో ఉందని, అందులో ఎలాంటి డేటా లేకుండా చేశారని చెప్పారు. వాదనలు విన్న జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి కదా అని జస్టిస్ నాగరత్న అన్నారు.
ప్రభాకరరావు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మరోసారి ఆదేశించారు. దర్యాప్తు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో నాలుగు వారాల సమయం ఇచ్చారు.