హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : వక్ఫ్ సవరణ చట్టంలోని కీలక నిబంధనలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వక్ఫ్ సవరణ చట్టం విషయంలో బీజేపీ ప్రభుత్వ తీరును మొదటి నుంచి ప్రశ్నించాం. చట్టం కాకముందే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరాం. కానీ బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ఏకపక్ష వైఖరికి చెంపపెట్టులాంటిది’ అని పేర్కొన్నారు.
అంబేదర్ అందించిన రాజ్యాంగం ప్రకారం ఒక శాతం ఉన్న ప్రజలకు కూడా మతపరమైన హకులు ఉన్నాయని నారాయణ చెప్పారు. మణిపూర్ మూడేండ్లుగా మండిపోతున్నా అటువైపు చూడని ప్రధాని మోదీ.. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. ఆయన పర్యటనలో నిజాయితీ లేదని తెలిపారు. తెలంగాణ విముక్తి పోరాటంపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని నారాయణ విమర్శించారు.