(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. మహారాష్ట్రలో శివసేన (ఠాక్రే-షిండే), ఎన్సీపీ (శరద్‌పవార్-అజిత్‌పవార్) కేసులలో సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌కు లోబడి ఆ రాష్ట్ర స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక స్పీకర్లు.. ఫిరాయింపు నిరోధక చట్టం కింద పలువురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. పార్టీ ఫిరాయించిన ఓ మణిపూర్ మంత్రికి రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారింది. ఇలాంటి ఉదంతాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.
ఒక పార్టీ బీఫాంతో పోటీ చేసి గెలిచి.. మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. స్పీకర్ అలా చేయలేని పక్షంలో ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ కోర్టును ఆశ్రయించే అవకాశం ఫిర్యాదుదారులకు ఉంటుందని గుర్తుచేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకొనే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది. ఈ నిర్ణయాన్ని స్పీకర్ పరిమిత సమయంలోపు తీసుకోవాలనే నిబంధన గతంలో లేదు. దీంతో రాజకీయ ప్రయోజనాలను అనుసరించి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగేది. దీనిపై దృష్టిసారించిన సుప్రీంకోర్టు ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని.. అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్లకు డెడ్లైన్లు విధిస్తున్నది. మహారాష్ట్రలోని ఎన్సీపీని చీల్చి.. శివసేన (షిండే)-బీజేపీ కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్‌పవార్ వర్గం ఎమ్మెల్యేలపై ఎన్సీపీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. శివసేన (షిండే) ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లకు కూడా ఇదే తరహా డెడ్‌లైన్‌ను విధించింది. దీంతో కోర్టు ఆదేశాలు పాటించకపోతే, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్న భావనతో ఈ రెండు కేసులలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది.
ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడటంతోపాటు వారి రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరమయ్యే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మణిపూర్ మంత్రి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇందుకు ఉదహరిస్తున్నారు. మణిపూర్‌లో 2017లో కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన తౌనోజామ్ శ్యామ్‌కుమార్ సింగ్.. బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో మంత్రి పదవి దక్కింది. శ్యామ్‌పై అనర్హత వేటు వేయాలని 2017లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మూడేండ్లపాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేశారు. దీంతో ఈ కేసును 2020లో విచారించిన సుప్రీంకోర్టు.. శ్యామ్‌కుమార్‌ను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా.. తాము ఉత్తర్వులు ఇచ్చే వరకూ శ్యామ్ శాసనసభలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.
ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడం, దానిని సుప్రీంకోర్టు సమర్థించం వంటి ఉదంతాలు గతంలో హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలోనూ జరిగాయి. రాజ్యసభ ఎన్నికల్లో విప్‌ను ధిక్కరించి.. బీజేపీకి ఓటు వేసిన ఆరుగురు హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిరుడు ఫిబ్రవరిలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ అనర్హత వేటు వేశా రు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేటుపడ్డ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అక్కడ వారికి చుక్కెదురైంది. స్పీకర్ నిర్ణయాన్ని అత్యున్నత ధర్మాసనం సమర్థించింది.
2019లో కర్ణాటకలోని అప్పటి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఓటింగ్‌కు ముందు అధికారంలోని సంకీర్ణ సర్కారుకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో వారి రాజీనామాలను ఆమోదించకుండా పక్కనబెట్టిన స్పీకర్.. ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిలో 15 మందిపై వేటు వేశారు. 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు కూడా జారీ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 15 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద స్పీకర్ వారిపై వేటు వేయడాన్ని సమర్థించిన ధర్మాసనం.. ఎన్నికల్లో పోటీ చేయవద్దన్న ఆదేశాలను మాత్రం పక్కనబెట్టింది.
సహేతుక కారణాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా సభాధ్యక్షులు రాజకీయ పార్టీ విలీనానికి సమ్మతించినప్పుడు.. ఆ ప్రక్రియను న్యాయస్థానంలో సవాల్ చేయవచ్చు. చట్టానికి లోబడి సభ్యులపై చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షుడు విఫలమైనప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు. రాజకీయ పార్టీలు చేసే ఫిర్యాదులపై సభాధ్యక్షులు నిర్ణయం తీసుకోవడంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినప్పుడు న్యాయస్థానాలకు వెళ్లొచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ 10 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు.
పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు 1985లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ హయాంలో ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని’ తీసుకొచ్చింది. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పదో షెడ్యూల్‌ను చేర్చింది. రాజ్యాంగంలోని 101, 102, 190, 191 ఆర్టికల్స్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరించారు. ఫిరాయింపునకు పాల్పడిన సభ్యులపై అనర్హత వేటు వేసే నిర్ణయాధికారం పూర్తిగా సభాధ్యక్షులకే ఉంటుంది. పార్టీ ఫిరాయింపుతోపాటు, పార్టీలో చీలిక, పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటేయడం తదితర అంశాలు వివాదాస్పదమైనప్పుడు కూడా నిర్ణయం తీసుకొనే అధికారం సభాధ్యక్షుడికే ఉంటుంది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా స్పీకర్ నిర్ణయం తీసుకొంటే, దానిపై న్యాయ సమీక్షకు కూడా వెళ్లొచ్చు. 1993లో కిహాట హాల్లో హాన్ వర్సెస్ జాచిల్హూ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని తేల్చిచెప్పింది. అయితే, స్పీకర్ నిర్ణయంపై మళ్లీ న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొన్నది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడం రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం ఆ సందర్భంగా గుర్తుచేసింది.