తెలంగాణ ఆయారాం- గయారాంల పనైపోయింది. ఫిరాయింపును ఎదుర్కోవడమంటే గోడ దూకినంత తేలిక కాదనే తత్వం బోధపడింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బండి లాగడమనే సూత్రం అన్ని వేళలా కుదరదని తేటతెల్లమైంది. రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ.. అదే రాజ్యాంగ నిర్దేశంతో ఏర్పాటైన చట్టసభల్లో తిష్ట వేస్తామంటే చెల్లదని జ్ఞానోదయమైంది. మూడునెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇకనైనా రాజ్యాంగం జేబులో పెట్టుకుతిరిగే రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్.. ఆ నాయకులతో రాజీనామా చేయించి ‘జై సంవిధాన్’ ఆశయాన్ని నిజంగానే నిలబెడుతుందా? లేక జంప్ జిలానీల కొమ్ముకాసి వారికి ఉపఎన్నికలు అనే పంగనామాలు పెడుతుందా? చూడాలి!!
స్పీకర్ ఒక న్యాయ నిర్ణాయక అధికారిగా ఉంటూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. అలా వ్యవహరించే క్రమంలో రాజ్యాంగపరమైన మినహాయింపులేవీ స్పీకర్ పొందలేరు.
రాజకీయ ఫిరాయింపులనే దుష్ట సంప్రదాయం జాతీయ స్థాయిలో ఆందోళనకర అంశంగా మారింది. వాటిని అరికట్టకపోతే.. అవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తులుగా మారుతాయి.
ఏ ఎమ్మెల్యే అయినా ప్రక్రియను పొడిగించాలని అడిగేందుకు స్పీకర్ అనుమతించకూడదు. ఎవరైనా అలా చేస్తే ప్రతికూల నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను స్పీకర్ కలిగి ఉంటారు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు దాటవద్దని, ఒకవేళ ఆలస్యం చేసేలా ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే, ప్రతికూల నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ స్పీకర్‌కు ఉన్నదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సూచించింది. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్‌పై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు 74 పేజీల తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి మూడు నెలల వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించింది. అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడానికి అనుమతిస్తే ఫిరాయింపుదారులు లబ్ధి పొందుతారని అభిప్రాయపడింది. కాబట్టి ‘ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్’ అనే పరిస్థితిని తాము అనుమతించలేమని న్యాయస్థానం పేర్కొన్నది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టే సమయంలో (52వ రాజ్యాంగ సవరణ) వ్యక్తమైన అభిప్రాయాలు, అభ్యంతరాలను సీజేఐ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రాజకీయ ఫిరాయింపుల దుష్ప్రభావాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నివారించకపోతే మన ప్రజాస్వామ్య పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉన్నది’ అని పేర్కొన్నారు. ఫిరాయింపులకు సంబంధించి అనర్హతలపై నిర్ణయం తీసుకునే బాధ్యతను చట్టసభలు శాసనసభ స్పీకర్‌కు అప్పగించడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం ‘కోర్టుల్లో, ఎలక్షన్ కమిషన్‌లో పిటిషన్లు వేయడం ద్వారా వ్యవహారాన్ని సాగదీసే వ్యూహాలను నివారించడం, శాసనసభల కాలపరిమితి ముగియకముందే సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే’ అని ధర్మాసనం నొక్కిచెప్పింది. అయితే పార్లమెంట్ నమ్మకాన్ని చాలా సందర్భాల్లో స్పీకర్లు గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు.. విచారణను ఆలస్యం చేసే ప్రయత్నాలను స్పీకర్ అడ్డుకోవాలని సూచించింది. ఆలస్యం చేసే వ్యూహాలు పన్నితే, వారిపై ప్రతికూల చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నది.
పదో షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్‌గా వ్యవహరించే స్పీకర్‌కు ఎలాంటి ‘రాజ్యాంగ రక్షణ’లు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదో షెడ్యూల్‌ను సమర్థించిన కీహోటో హోలోహాన్ తీర్పును ప్రస్తావిస్తూ.. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష అధికారాలు పరిమితంగా ఉన్నాయని, అయితే అదే సమయంలో స్పీకర్ నిర్ణయాలు పూర్తిగా న్యాయ సమీక్షకు అతీతం కాదని, న్యాయ సమీక్ష నుంచి మినహాయింపులు కూడా కలిగి ఉండవని తేల్చిచెప్పింది. ‘స్పీకర్ నిర్ణయాలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చేందుకు కోర్టులకు అనుమతి లేకపోయినా, సత్వరమే నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడే జ్యుడీషియల్ ఆదేశాలు ఇచ్చే అనుమతి కోర్టులకు ఉన్నదని కిహోటో హోలోహాన్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్నది’ అని గుర్తుచేసింది. స్పీకర్లు అనర్హత పిటిషన్లను ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించలేదని అభిప్రాయపడింది. ఫిరాయింపుదారులపై అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కీషమ్ మేఘచంద్ర సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉటంకించింది. ఫిరాయింపులకు సంబంధించి ఎన్సీపీ, శివసేన పార్టీల పిటిషన్లపై నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర స్పీకర్‌కు గతంలో జారీచేసిన ఆదేశాలనూ పరిగణనలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. కిహాట హాల్లో హాన్, సుభాష్ దేశాయ్ కేసులను ప్రస్తావిస్తూ ‘అనర్హత పిటిషన్లపై కోర్టు స్వయంగా నిర్ణయం తీసుకోవాలి’ అన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత దాదాపు ఏడు నెలలపాటు స్పీకర్ కనీసం నోటీసులు కూడా జారీచేయలేదని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ‘స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకున్నారా, లేదా? అనే ప్రశ్నను ఇప్పుడు మనం స్వయంగా వేసుకుంటున్నాం. సత్వర చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే అనర్హత పిటిషన్లను విచారించే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్/ చైర్మన్‌కు పార్లమెంట్ అప్పగించింది. కానీ ఏడు నెలల వరకు కనీసం నోటీసులు కూడా జారీచేయకపోవడం, ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన తర్వాత నోటీసులు జారీచేయడం సత్వర చర్యగా పరిగణించలేము’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు పూర్వాపరాలు, వాస్తవాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయకపోతే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ లక్ష్యం దెబ్బతింటుందని కోర్టు పేర్కొన్నది. ‘ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలు జారీచేయకపోతే ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అనే విమర్శలను స్పీకర్ పునరావృతం చేసేందుకు మేము అనుమతించినట్టు అవుతుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అనర్హత పిటిషన్లపై నిర్ణయ బాధ్యతను స్పీకర్/చైర్మన్‌కు అప్పగించిన ప్రస్తుత విధానం రాజకీయ ఫిరాయింపులను అడ్డుకుంటున్నదా, లేదా? అనేది పునరాలోచించాలని పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచించింది. ‘మాకు సలహా ఇచ్చే అధికారం లేనప్పటికీ, అనర్హతను నిర్ణయించే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్/ చైర్మన్‌కు అప్పగించే ఈ విధానం రాజకీయ ఫిరాయింపులను సమర్థంగా ఎదుర్కొని, లక్ష్యాలను సాధిస్తున్నదా, లేదా? అనే విషయాన్ని పార్లమెంటు పునరాలోచించాలి. మన ప్రజాస్వామ్య పునాది, దానిని నిలబెట్టే సూత్రాలను కాపాడుకునేందుకు ప్రస్తుత విధానం సరిపోతుందా, లేదా? అని ఆలోచించుకోవాలి. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉన్నది’ అని న్యాయస్థానం పేర్కొన్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 3న ముగియగా, ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పును వెలువరిచింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించగా, ప్రతివాదులైన ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ, రవిశంకర్ జంధ్యాల, గౌరవ్ అగర్వాల్, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.