Supreme Court | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా ఉప ఎన్నికలు జరుగవు అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమేనని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి అనర్హతకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయరాదని, తాము కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేయడంలో కొంత ఆలస్యం చేయవచ్చు.. కానీ శక్తిహీనులం మాత్రం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం.. మార్చి 26న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘అధ్యక్షా, సభ్యులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను వారికి హామీ ఇస్తున్నాను. ఉప ఎన్నికలు రావు. బీఆర్ఎస్ సభ్యులు వారి సీట్ల కోసం కోరుకున్నా కూడా ఉప ఎన్నికలు రావు. వారు ఇటొచ్చినా, అటొచ్చినా, ఎటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారని తెలిపారు. దీనిపై జస్టిస్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ఒకవేళ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే.. మీ ముఖ్యమంత్రి 10వ షెడ్యూల్‌ను అవహేళన చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలకు, అసెంబ్లీలో చేసే వ్యాఖ్యలకు వ్యత్యాసం ఉంటుందని అన్నారు. ‘రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఏదైనా చెప్పినప్పుడు, దానికి కొంత పవిత్రత ఉంటుంది. శాసనాన్ని అర్థం చేసుకోవడానికి అసెంబ్లీలో ఒక మంత్రి చేసిన ప్రకటనను ఉపయోగించుకోవచ్చని చెప్పే తీర్పులు ఉన్నాయి’ అని వివరించారు.
ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇకపైనైనా జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించాలని న్యాయవాది ముకుల్ రోహత్గీకి సూచించారు. అయితే తాను ముఖ్యమంత్రి తరఫున వాదించడం లేదని, అసెంబ్లీ స్పీకర్ తరఫున మాత్రమే హాజరయ్యానని రోహత్గీ చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘మిస్టర్ రోహత్గీ ఇంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆయన తరఫున వాదనలు వినిపించారు’ అని గుర్తుచేశారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు.. ‘బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బెయిల్ మంజూరు అయింది’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి అప్పట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. రేవంత్‌రెడ్డి గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఇదే విషయాన్ని బుధవారం జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. ‘మేము నెమ్మదిగా కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తామేమో కానీ.. శక్తిహీనులం మాత్రం కాదు’ అని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ.. మీ ఉద్దేశంలో సహేతుక సమయం అంటే ఎంతకాలం? అని ప్రశ్నించారు. అనర్హత పిటిషన్లు దాఖలు చేసి 11 నెలలు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ.. నిరుడు మార్చి 18న పిటీషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, ఈ ఏడాది జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని చెప్పారు. అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన వారం రోజుల్లోపే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. మరి నోటీసులు జారీ చేయడానికి 10 నెలల సమయం ఎందుకు తీసుకున్నారు? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రోహత్గీ చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ ఘాటుగా స్పందించారు. ‘కేసు హైకోర్టులో ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడం సరైంది కాదు అని అప్పుడు ఆగారు. కానీ విషయం సుప్రీంకోర్టుకు వచ్చిన తరువాత మాత్రం నోటీసులు జారీ చేశారు. ఇది కోర్టు ధిక్కరణ కాదా?’ అని నిలదీశారు.
‘హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. నిజానికి సింగిల్ జడ్జి ఎంతో ఉదారంగా నాలుగు వారాల్లో ఒక షెడ్యూల్‌ను నిర్ణయించాలని మాత్రమే ఆదేశించారు. నాలుగువారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించలేదు’ అని పేర్కొన్నారు. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని విజ్ణప్తి చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా? అని ప్రశ్నించారు. ‘మీరు ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా నాట్యం చేయిస్తుంటే కోర్టులు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా?’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ నాలుగేండ్ల్ల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కోర్టులు చేతులు కట్టుకొని ఉండాలా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా కోర్టులు కచ్చితంగా జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు.
‘మేము స్పీకర్‌కు సూచనలు ఇస్తాం. ఏదైనా రాజ్యాంగబద్ధ సంస్థ లేదా వ్యవస్థ న్యాయస్థానం సూచనలను మన్నించకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. ఆర్టికల్ 142 ప్రకారం మేము శక్తిహీనులం కాదు’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు సమన్లు జారీచేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. ‘ధికరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచిన సందర్భం కూడా ఉన్నదని మర్చిపోవద్దు’ అని పేరొన్నారు. గురువారం అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. అనంతరం.. పిటిషనర్ల తరఫున ఆర్యమ సుందరం సమాధానం ఇవ్వనున్నారు.
స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని అన్నారు. నిర్దేశిత కాల పరిమితిలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదని అన్నారు. అందుకే ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసిందని తెలిపారు. ఒకవేళ న్యాయస్థానం ఏమైనా సూచనలు చేసినా.. వాటిని పాటించాలా? లేదా? అనే నిర్ణయాధికారం స్పీకర్‌దే అని స్పష్టం చేశారు.