HCU Lands | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లో పనులు కొనసాగకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా ఉల్లంఘనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై అమికస్ క్యూరీ పరమేశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. కంచ గచ్చిబౌలి భూముల కేసుపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉదయం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా మీడియాలో వచ్చిన కథనాలను పరమేశ్వర్ ధర్మాసనం ముందు ఉంచారు. వరుసగా వచ్చిన సెలవులను ఆసరాగా తీసుకొని ప్రభుత్వం వందలాది ఎకరాల్లోని అటవీ భూముల్లో కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరించింది. కంచ గచ్చిబౌలిలో అటవీ నిర్మూలన చర్యలు జరిగినట్టు స్పష్టమవుతున్నదని తెలిపింది.
ఆ ప్రాంతంలో ఎనిమిది రకాల అరుదైన జీవజాతులు నివసిస్తున్నాయని చెప్తున్నారని, వందల యంత్రాలతో ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్టు కనిపిస్తున్నదని అన్నారు. ప్రభుత్వ చర్యలతో భారీ సంఖ్యలో వృక్షాలను నేల కూల్చినట్టు అర్థమవుతున్నదని పేర్కొన్నా రు. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి, పరిశీలించి, మధ్యాహ్నం 3.30 గంటలలోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ కంచ గచ్చిబౌలికి వెళ్లి, క్షేత్రస్థాయి విచారణ జరిపి సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు.
మధ్యాహ్నం ధర్మాసనం విచారణ తిరిగి ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘కూల్చివేతలకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా? ఇది చాలా తీవ్రమైన అంశం. చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారు?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ వివరణతో అఫిడవిట్‌ను దాఖలు చేస్తామని అగర్వాల్ సమాధానం ఇవ్వగా.. ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ‘మొత్తం ఆపేయాలని ఆదేశిస్తున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఒక చెట్టును కూడా కూల్చివేయొద్దు, ఎలాంటి పనులు జరగరాదు’ అని ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఏమైనా పనులు జరిగినట్టు తేలితే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే.. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రభుత్వం చేసిన విధ్వంసం కనిపిస్తున్నదని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. భారీగా యంత్రాలను మోహరించి దాదాపు 100 ఎకరాల్లో పనులు చేపట్టినట్టు, ఆ ప్రాంతాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించినట్టు, భారీ సంఖ్యలో చెట్లను నరికేసినట్టు అర్థమవుతున్నదని అన్నారు. ఫొటోలను బట్టి చూస్తే ఆ ప్రాంతంలో నెమళ్లు, జింకలు ఇతర జీవజాతులు నివసిస్తున్నట్టు తెలుస్తున్నదని, కుంటలు కూడా ఉన్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించారు. రిట్ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా అమికస్ క్యూరీ పరమేశ్వర్‌కు సూచించారు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ)ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చెట్లను సంరక్షించడం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పనులు చేపట్టవద్దని తేల్చి చెప్పారు.
అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి సంబంధించి సుప్రీంకోర్టు గత నెల నాలుగో తేదీన ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం ఉటంకించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలరోజుల్లోపు నిపుణుల కమిటీని నియమించాలని ఆదేశించామని, కమిటీలు ఆరు నెలల్లోగా అధ్యయనం చేసి నివేదిక అందించాలని ఆదేశించామని గుర్తుచేసింది. ఈ లోగా ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ భూములకు నష్టం చేసే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించామని పేరొన్నది. ఈ మేరకు తెలంగాణలో కమిటీ ఏర్పాటుచేసిన రెండు రోజుల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాల్లో అటవీ నిర్మూలన చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని ప్రశ్నించింది.
రెండు మూడు రోజుల్లోనే దాదాపు 100 ఎకరాల్లో చెట్లను నరికి వేయడం పట్ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అకడ చెరువు ఉన్నదంటే.. చుట్టుపకల కచ్చితంగా క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందని జస్టిస్ గవాయ్ పేరొనగా.. అవి అటవీ భూములు కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ‘అది అడివా? కాదా? అన్నది కాదు. చెట్లను తొలగించే ముందు మీరు సంబంధిత అనుమతులు తీసుకున్నారా? రెండు మూడు రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లను తొలగించడం అంటే సామాన్య విషయం కాదు’ అని జస్టిస్ గవాయి పేరొన్నారు. ‘మీకు ఒక విషయం గుర్తు చేయదలచుకున్నాను.. మీరు ఎంతటి వారైనా సరే చట్టాన్ని మించినవారు కాదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చదును పనులను నిలివేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసింది. గురువారం మధ్యాహ్నం దాకా చదును పనులను ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా బుధవారం రాత్రి నుంచే పనులు కొనసాగిస్తూ గురువారం ఉదయం 11 గంటల దాకా పచ్చదనాన్ని తొలగించారు. కట్టర్ మిషన్లతో పెద్దపెద్ద వృక్షాలను నరికేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడికి వస్తున్నారని తెలిసి అప్పుడు పనులు ఆపేశారు.
ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పలు ప్రశ్నలు సంధించింది. వాటికి ఈనెల 16వ తేదీలోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
1) అటవీ భూములుగా చెప్తున్న ప్రాంతంలో చెట్లను తొలగించి అత్యవసరంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అగత్యం ఏమొచ్చింది?
2) కూల్చివేతలు చేపట్టే ముందు పర్యావరణంపై పడే దుష్ప్రభావానికి సంబంధించి.. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్టిఫికెట్ తీసుకున్నారా?
3) అటవీ శాఖ అధికారుల నుంచి గాని, సంబంధిత ఇతర అధికారుల నుంచి కానీ అనుమతులు తీసుకున్నారా? లేదా?
4) రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15న నియమించిన కమిటీలో ఎలాంటి సంబంధం లేని ఐదుగురు అధికారులను ఎందుకు చేర్చారు? వారికి అడవులను గుర్తించే ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా తెలుస్తున్నది.
5) కూల్చివేసిన చెట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది?