హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవ్వబోయే తీర్పునకు లోబడే గ్రూప్-1 నియామకాలు ఉంటాయని స్పష్టంచేసింది. గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయామాల్య బాగ్జీల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామకపత్రాలు అందించడంపై స్టే ఇవ్వాలని కోరారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలివ్వడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే వాదనలు విన్న ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన పిటిషన్లు అన్నీ ఈ నెల 15న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణకు రానున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
మెడికల్ కాలేజీ చైర్మన్, ప్రిన్సిపాల్‌కు వారెంట్ ; రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మానవ హకుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం రెండు వేర్వేరు కేసుల్లో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేటలోని సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్, ప్రిన్సిపాల్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించారు. 2020లో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన తిప్పర్తి సహస్ర (7) అనే చిన్నారి ఆల్బెండజోల్ మాత్ర తీసుకున్న తర్వాత మరణించినట్టు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటో కేసు నమోదు చేసిన హెచ్ఆర్సీ.. ఆ బాలిక తల్లికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేసింది.