హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల పదవుల్లో బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచు తూ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్-9 అమలుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
బీసీ రిజర్వేషన్ల పెంపునకు వీలుగా శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండానే ఆ బిల్లుకు అనుగుణంగా జీవోలను ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ రాష్ట్రపతికి పంపారని, వారిద్దరి నుంచి ఆమోదం లభించనందున బిల్లుకు చట్టబద్ధత కల్పించేముందు ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయలేదని నిలదీసింది. ఒక కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించవచ్చుననే రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో అధికంగా గిరిజనులు ఉన్నందున ఆ ప్రాంతాల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం మించవచ్చునని గుర్తుచేసింది.
బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఇంకేమైనా చెప్పదల్చుకుంటే తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. రిజర్వేషన్ల పెంపు అంశం హైకోర్టులో విచారణలో ఉండగా తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకొంటే.. పాత రిజర్వేషన్ల ప్రకారం.. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీ 10 శాతం, బీసీలకు 25 శాతంతో నిర్వహించుకోవచ్చని సూచించింది. ఈ వ్యవహారంలో మెరిట్స్ ఆధారంగా తగిన ఉత్తర్వులు జారీచేయాలని హైకోర్టుకు సూచన చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీపై సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపుదల చేసే వ్యవహారం ప్రభుత్వ పరిధిలోనిదని అన్నారు. శాస్త్రీయంగా సర్వే చేసి బీసీ జనాభా తేల్చిన కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు రిజర్వేషన్ల పెంపు జరిగిందని తెలిపారు. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాదులు గోపాల్‌శంకర్ నారాయణ్, కే వివేక్‌రెడ్డి, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
తాము ప్రభుత్వ సర్వే, క్యాబినెట్ నిర్ణయాల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లు పెంచడాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని పలు కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. షెడ్యూల్డ్ ఏరియా, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతం మించవచ్చని చెప్పిందని తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ వాదనల సమయంలో సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.
బీసీ రిజర్వేషన్ల పెంపు వ్యవహారం రాష్ట్రపతి వద్ద ఉంది కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘గత మార్చిలో రాష్ట ప్రభుత్వం గవర్నర్‌కు పంపితే, దానిని గవర్నర్ వారంరోజుల తర్వాత రాష్ట్రపతికి పంపారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం చెప్పకుండా ఉంటే ఎంతకాలం వేచి చూడాలి?’ అని సింఘ్వీ ప్రశ్నించారు. గవర్నర్, రాష్టపతి ఆమోదం చెప్పకుండానే ప్రభుత్వం చట్టం ఎలా చేస్తుందన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు.. ‘ఇది విధాన నిర్ణయం.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం చెప్పకుండా ఉండటం సరికాదు. ఈ వ్యవహారంపై హైకోర్టు స్టే ఇవ్వడం కూడా చెల్లదు. స్టేను ఎత్తివేయాలి’ అని సింఘ్వీ పేర్కొన్నారు. ఈ దశలో సీనియర్ న్యాయవాది గోపాల్‌శంకర్ నారాయణ్ కల్పించుకుంటూ.. గవర్నర్ ఆమోదం లేని బిల్లుకు అనుగుణంగా జీవో వెలువరించిన ప్రభుత్వం ఆ మేరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ బిల్లుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీచేసిందా? అని ప్రశ్నించింది.
‘చట్ట సవరణ బిల్లు కూడా గవర్నర్ వద్దనే పెండింగ్‌లో ఉంది. అయితే, చట్ట సవరణకు ముందు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఎంతకాలం ప్రభుత్వం నిరీక్షించాలి? అందుకే జీవో ద్వారా బిల్లును అమల్లోకి తెచ్చింది’ అని సింఘ్వీ జవాబు చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించిందని సింఘ్వీ చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ జీవో 9 జారీ అయిన రాత్రే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందని, తెలంగాణ ప్రభుత్వానికి అంత హడావుడి ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ప్రజాప్రభుత్వ నిర్ణయం మేరకు జీవో వెలువడిందని సింఘ్వీ చెప్పారు. ‘ఇందిరా సహాని కేసులో రాజకీయ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెప్పలేదు. రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు చెప్పిందనుకోవడం అపోహ మాత్రమే. కిషన్‌రావు గావలీ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయంగా సర్వే చేశాకే రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని చెప్పారు. పిటిషనర్లు చట్టాన్ని సవాలు చేయలేదని, కేవలం జీవోలను మాత్రమేనని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు.. బిల్లును సవాలు చేయలేదని ప్రభుత్వ ఎలా అంటుందని, బిల్లుకు గవర్నర్ ఆమోదం చెప్పలేదని, పోనీ, గవర్నర్ ఆమోదం లభించినట్టుగా ప్రభుత్వం పరిగణించి ఉంటే ఆ మేరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా అని ప్రశ్నలు వేసింది.
బిల్లు చట్టం అయ్యిందని సింఘ్వీ మళ్లీ చెప్పారు. ఈ ప్రత్యర్థి న్యాయవాది కల్పించుకుంటూ.. బిల్లుకు చట్టబద్ధతే లేదు కాబట్టే చట్టాన్ని సవాలు చేయలేదని అన్నారు. జీవో 9 ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42 శాతం చేయడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి పెరగడాన్నే సవాలు చేశారని వివరించారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు కచ్చితమైన ఆదేశాలిచ్చిందని, దీని ప్రకారం రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించడానికి వీల్లేదని అన్నారు. ఈ ఒక పాయింట్లోనే జీవోను సవాలు చేశామని చెప్పారు. తిరిగి సుప్రీంకోర్టు కల్పించుకుంటూ.. బీసీ జనాభా పెరిగిన మేరకు రిజర్వేషన్లు పెంపుదల చేయాల్సివస్తే ఆ పరిధి 50 శాతం దాటకుండా ఎస్సీ, ఎస్టీ రిజ ర్వేషన్లను తగ్గించాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది. ప్రత్యేక పరిస్థితులున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎస్టీ ప్రాంతాలకు మాత్రమే పెంపు వర్తిస్తుందని గుర్తుచేసింది. ఆ తీర్పు ఈబీసీ రిజర్వేషన్లకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.