హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాదాపు 48 ఏండ్లపాటు అమల్లో ఉన్న స్థానికత నిబంధనను మార్పు చేస్తే నేటితరం విద్యార్థులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతుండగానే రాజ్యాంగ నిబంధనలు, ప్రభుత్వ జీవోల గురించి తెలుసుకోవాలనే వాదన సబబుగా లేదని వ్యాఖ్యానించింది. చదువుకోని తల్లిదండ్రులు కూడా ఉంటారని గుర్తుచేసింది. మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించిన వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను ముగించింది.
మంగళవారం ఇరుపక్షాల వాదనలు సుమారు రెండున్నర గంటలకుపైగా విన్న అనంతరం తీర్పును తర్వాత వెలువరిస్తామని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం అభ్యర్థులు నీట్ రాయడానికి ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణ రాష్ట్రంలో చదివి ఉంటేనే స్థానికత వర్తిస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 33 జారీచేసింది. ఆ జీవోలోని నిబంధన 3 (ఏ) చెల్లదంటూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి అభిరామ్ మరో 160 మంది గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి మార్గదర్శకాలు లేవని, వాటిని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2024 సెప్టెంబర్ 5న హైకోర్టు తీర్పు చెప్పింది. దానిని రద్దు చేయాలంటూ తెలంగాణ సరార్ నిరుడు సెప్టెంబర్ 11న సుప్రీంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. సీజేఐ నే తృత్వంలోని ధర్మాసనం విచారణ పూర్తిచేసింది.
అందరికీ నిబంధనలు తెలియకపోవచ్చు
తెలంగాణలో వరుసగా నాలుగేండ్లు చదివితేనే మెడికల్ అడ్మిషన్లలో స్థానికత నిబంధన వర్తిస్తుందనే విషయం రాష్ట్రంలోని వారందరికీ తెలియకపోవచ్చునని ధర్మాసనం అభిప్రాయపడింది. ధనవంతుల పిల్లలు 11, 12వ తరగతులు విదేశాల్లో చదవి తిరిగి తెలంగాణకు వచ్చి స్థానికత కోరితే రాష్ట్రంలోని విద్యార్థులు నష్టపోతారన్న ప్రభుత్వ వాదనపై స్పందిస్తూ.. విదేశాల్లో చదివిన విద్యార్థులకు ఎన్ఆర్ఐ కోటా ఉందని గుర్తుచేసింది. స్థానికత నిబంధనల జీవో 33ను గత ఏడాది జారీచేసి దానిని వెంటనే అమలుచేయడానికి ముందు నాలుగేండ్ల గడువు అంటే 2028 వరకు ఇచ్చి ఉంటే అప్పటికే వేరే రాష్ట్రాలు/దేశాల్లో చదవిన విద్యార్థులు నష్టపోకుండా ఉంటారు కదా అనే కీలక ప్రశ్నను ప్రభుత్వం ముందుంచింది. జీవో జారీ చేయడానికి ముందే తెలంగాణ విద్యార్థులు వేరే రాష్ట్రాల్లో చదువుతూ ఉంటే.. జీవో వెలువడిన అనంతరం వారి పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
జీవో జారీకి ముందే ఇతర రాష్ట్రాల్లో చదివితే
ప్రభుత్వ జీవో 33 వల్ల విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణలో పుట్టి అక్కడే టెన్త్ వరకు చదివిన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తరఫున సీనియర్ న్యాయవాదులు రాజేంత్ బసంత్, ఏఓఆర్ భబ్నాదాస్ వాదించారు. ‘జీవో 33 కారణంగా తెలంగాణలో పుట్టి పదో తరగతి వరకు చదివినప్పటికీ ఇంటర్మీడియట్ వేరే రాష్ట్రంలో చదివితే స్థానిక కోటా దకడం లేదు. 11, 12వ తరగతులను తెలంగాణలో చదవని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది జీవో 33 జారీ చేసి నీట్ రాయడానికి ముందు నాలుగేండ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలనే నిబంధన విధించడం చెల్లదు. నాలుగేండ్ల గడువు ఇచ్చి నిబంధనను అమలు చేయాలి. ఈ జీవో వస్తుందనే విషయం తెలియక అప్పటికే వేరే రాష్ట్రాలు లేదా విదేశాల్లో రెండేండ్లు చదివి ఉంటే అన్యాయంగా నష్టపరిచిన అపకీర్తి రాష్ట్ర ప్రభుత్వానికే దకుతుంది. నీట్లో స్థానిక కోటా దకక నష్టపోతున్నారు. తల్లిదండ్రుల ఉద్యోగం కారణంగా కేరళ రాష్ర్టానికి చెందిన విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లలో అర్హత సాధించిన సంఘటనలు ఉన్నాయి’ అని తెలిపారు.
తెలంగాణ వాళ్ల కోసమే..
తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నివాస నిబంధనను తీసుకువచ్చిందని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ‘ధనవంతులు అమెరికా, లండన్, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి చదువుకుంటారు. ఆ విధంగా విదేశాలకు వెళ్లి 11, 12 తరగతులు చదివిన వాళ్లు అతి సులభంగా మెడికల్ సీటు పొందుతారు. దీనివల్ల తెలంగాణలో చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ స్థానికతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం. ఈ క్రమంలోనే జీవో 33 తెచ్చాం. విదేశాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకుని తిరిగి ఇకడికి వచ్చి స్థానికులమని అంటే ఎలా? ఏపీ విభజన చట్టం-2014లో ఆ నిబంధనకు కటాఫ్ ఉంది. ఐఏఎస్/ఐపీఎస్ ఇతర ఉద్యోగాల్లో పేరెంట్స్ డిప్యూటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వాళ్ల పిల్లలు వేరే చోట చదివినప్పటికీ వాళ్లకు స్థానికత వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు. వాదనలపై స్పందించిన ధర్మాసనం.. జీవో 33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించింది. ఏపీ విభజన చట్టం పదేండ్ల వరకే అయినా అందరికీ ఆర్టికల్ 371(డీ) లోని అం శాలు తెలియకపోవచ్చునని వ్యాఖ్యానించింది, 2024లో జీవో 33 తెస్తే.. రాబోయే నాలుగేండ్లలో బయట చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుంది కదా అని ప్రశ్నించింది. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ, హర్యానా, అస్సోం వంటి రాష్ట్రాల్లో స్థానికత నిబంధన అమల్లో ఉందని తెలిపారు.
చదువుకోని తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుంది?
ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో స్థానికత నిబంధనలు ఉన్నాయని కాళోజీ మెడికల్ వర్సిటీ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదించారు. ఏపీ విభజన తర్వాత విభజన చట్టం-2014లోని సెక్షన్ 95, రాజ్యాంగంలోని అధికరణం 371 (డీ) ప్రకారం పదేండ్ల వరకే తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సమాన అవకాశం ఉంది. ఆ తర్వాత స్థానికతపై విధిగా నిబంధనలు ఉండి తీరాలి. పదేండ్ల కాలం ముగిసినందున తెలంగాణ సరార్ జీవో 33 తెచ్చింది.. అని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, 48 ఏండ్లు అంటే 1974-2014 వరకు అమల్లో ఉన్న స్థానికత నిబంధనను మార్పు చేస్తే 2025లోని విద్యార్థులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. అన్ని పక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.