Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల్లో అన్ని రకాల చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలిసింది. మొన్న లగచర్ల, ఇప్పుడు హెచ్‌సీయూ.. ఇలా ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు తగలడంపై ఆలోచనలో పడినట్టు సమాచారం. ప్రజా వ్యతిరేకతకు కారణమవుతున్న ప్రభుత్వ విధానాలపై పలువురు మంత్రులు, కీలకనేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.
‘అస్తవ్యస్థ, ఏకపక్ష నిర్ణయాలతో నవ్వులపాలవుతున్నాం. మనల్ని అధికారంలోకి తీసుకొచ్చిన రైతులు, విద్యార్థులనే నిండా ముంచే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదు’ అని అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, కోర్టులతో మొట్టికాయలు తప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఏకపక్ష, దుందుడుకు నిర్ణయాలతో ఈ పరిస్థితి దాపురించిందని అభిప్రాయపడినట్టు తెలిసింది. తాజా పరిణామాలపై పలువురు మంత్రులు, కీలక నేతలు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది.
రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా తలపోటు తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలు అధిష్ఠానాన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా లగచర్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టినప్పుడు, తాజాగా హెచ్‌సీయూ భూముల విషయంలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం వంటి ఘటనలపై అధిష్ఠానం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నది.
నాడు హెచ్‌సీయూలో రోహిత్ వేముల మృతి నేపథ్యంలో పదే పదే యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు మద్దతు తెలిపిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు అదే యూనివర్సిటీలో సొంత పార్టీ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నాడు రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక, వారినే బాధితులుగా మార్చుతున్నారని, ఇదేనా మీ విధానం? అంటూ సోషల్‌మీడియా వేదికగా రాహుల్‌గాంధీపై ప్రశ్నలు కురిపిస్తున్నారు.
హెచ్‌సీయూపై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ మంత్రులు తమ వ్యతిరేకతను బహిరంగంగానే వెల్లడించినట్టు సమాచారం. ఇప్పటికైనా దీనిని ఇంతటితో ఆపితే బాగుంటుందని, లేదంటే మరింత నష్టం తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. అయితే ఈ వ్యతిరేకత తనపై రాకుండా ఉండేందుకు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థుల పేరుతో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సీఎం ముందుకు నెట్టారనే చర్చ జరుగుతున్నది. ఆ ఇద్దరు మంత్రులు అయిష్టంగానే మీడియా సమావేశం నిర్వహించినట్టు ప్రచారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సైతం వెళ్లి వ్యతిరేకతను తగ్గించాలని కోరగా, ఇందుకు ఆయన వ్యతిరేకించినట్టు తెలిసింది.
ఒకవైపు హెచ్‌సీయూ వివాదం దేశవ్యాప్తం కావడం, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానం అభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మంత్రులతో సమీక్ష సందర్భంగా అధిష్ఠానంలోని ఒక కీలక నేతకు ఫోన్ చేసినట్టు సమాచారం. ఈ భూ వ్యవహారంలో ముందుకెళ్తేనే అన్ని విధాలుగా సహకారంగా ఉంటుందని, లేదంటే పథకాల్లో కోతలు తప్పవని సీఎం చెప్పినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన సదరు నేత.. ‘అన్నీ మాకు చెప్పే చేస్తున్నారా? ఈ పని మొదలు పెట్టినప్పుడు మాకేమైనా చెప్పారా? ఇప్పుడెందుకు మా అనుమతి కోరుతున్నారు? నెపాన్ని అధిష్ఠానంపై నెట్టేద్దామనుకుంటున్నారా?’ అని క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంలోనే మరింత అసహనానికి గురైనట్టు సమాచారం.