హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ (25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టగా.. ఎకో సెన్సిటివ్ జోన్ పరిసరాల్లో చెట్ల నరికివేతను సవాలు చేస్తూ పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. హైదరాబాద్‌కు కేబీఆర్ పార్కు ‘గ్రీన్ లంగ్స్ స్పేస్’గా ఉన్నదని, ఎకోసెన్సిటివ్ జోన్‌కు రక్షణ కల్పించాలని పిటిషన్లో కోరారు. స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు మార్చి 31న నిరాకరించడంతో ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పనుల కోసం పార్కు పరిధిలో 1,300 చెట్లు నరికి వేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి వాదించారు. ప్రస్తుతం ప్రతిరోజూ 50 వరకు చెట్లు నరికివేస్తున్నారని, రాత్రి, పగలు తేడా లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం చెట్ల నరికివేత తప్పదని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. చెట్లు తొలగించకుండా నిర్మాణాలు చేపట్టవచ్చా? అని న్యాయస్థానం ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని న్యాయవాది తెలిపారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లు నరకొద్దని అభివృద్ధి బోర్డు చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. దీంతో చెట్ల నరికివేతపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు, ఎకోసెన్సిటివ్ జోన్‌ను ‘షాక్ అబ్జార్బర్’గా ఉంచాలని పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టు) పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.