రంగారెడ్డి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని సాహెబ్‌నగర్ కలాన్ గ్రామ పరిధిలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌కు సంబంధించిన కీలక కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మార్కెట్ విలువ సుమారు రూ.15,000 కోట్లున్న ఈ భూమిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సమర్థిస్తూ, గతంలో ఇచ్చిన ప్రతికూల ఉత్తర్వులను కోర్టు రద్దు చేసిందని రంగారెడ్డి డీఎఫ్‌వో రోహిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజులపాటు సాగిన విచారణ అనంతరం సర్వే నంబర్ 201/1లో ఉన్న సుమారు 102 ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా ప్రైవేట్ హక్కుల పేరిట దాఖలు చేసే దావాలు చట్టబద్ధంగా చెల్లవని న్యాయస్థానం తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ, 51ఏ(జీ) ప్రకారం అటవీ భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నది. ఈ తీర్పుతో రిజర్వ్ ఫారెస్ట్ భూముల ఆక్రమణలు, చట్టవిరుద్ధ హక్కుల నుంచి కాపాడే విషయంలో అటవీశాఖకు మరింత బలం చేకూరింది.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర జర్నలిస్టులకు సంబంధించిన అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డుల విషయమై రెండు రోజుల్లో జీవో జారీ కానున్నది. ఈ మేరకు అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలతో జీవోను జారీచేయనున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా జర్నలిస్టులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డుల అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సమావేశంలో పాల్గొన్న సంబంధిత అధికారి స్పందిస్తూ.. జర్నలిస్టుల అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డుల దరఖాస్తులకు రెండు రోజుల్లో జీవో జారీ చేస్తామని స్పష్టం చేశారు.