హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) చర్యలు కోర్టు ధిక్కరణ (Contempt of Court) కిందికే వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా తేల్చాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లోగా తేల్చాలంటూ చివరి అవకాశం ఇచ్చింది. లేదంటే కోర్టు ధిక్కరణ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ‘న్యూ ఇయర్ వేడుకలు ఎకడ జరుపుకోవాలని అనుకుంటున్నారో తేల్చుకోండి’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. పార్టీ ఫిరాయింపుల కేసులను స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో విచారిస్తారని గుర్తుచేసింది. కాబట్టి ఎలాంటి రాజ్యాంగపరమైన రక్షణలు ఉండబోవని భార త అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్లో తాము చర్యలకు ఉపక్రమించకముందే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కొలి కి తేవాలని స్పీకర్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి స్పష్టం చేశారు.
లేదంటే తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంపై మూడు నెలల్లో విచారించి తుది నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రాజ్యాంగబద్ధమైన విధులు, హైదరాబాద్‌లో వరదలు, రోజువారీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు తదితర కార్యక్రమాల్లో స్పీకర్ తీరిక లేకుండా గడుపుతున్నారని, దీంతో కోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యంకాలేదంటూ గత నెల 25న స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో మిస్లీనియస్ అప్లికేషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, వరద సహాయక చర్యలు తదితర కారణాలతో నియోజకవర్గ పర్యటనల్లో ఉన్నారని పేర్కొన్నది. మరో ఎనిమిది వారాల గడువు ఇస్తే, స్పీకర్ కొలికి తెస్తారని కోరింది. వీటితోపాటు పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ గతంలో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
తుది తీర్పు ఇవ్వకుంటే కోర్టు ధికరణ చర్యలు
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తాము ఇచ్చిన గడువులోగా స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలుచేయని స్పీకర్ తీరు కోర్టు ధికరణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. ‘వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటారో లేదా కోర్టు ధిక్కరణ పరిణామాలను ఎదుర్కొంటారో ఆయననే తేల్చుకోమనండి’ అని స్పీకర్‌ను ఉద్దేశించి సీజేఐ గవాయి వ్యాఖ్యానించారు. మీరు (స్పీకర్) చర్యలు తీసుకుంటారా? లేదా మేము (సుప్రీంకోర్టు) చర్యలు తీసుకుని చూపాలా? అని ప్రశ్నించారు. ‘స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని భావిద్దాం. లేదంటే మా ముందున్న పత్రాల ఆధారంగా మేమే నిర్ణయం ప్రకటిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రోజువారీగా విచారణ జరిపి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంపై మండిపడింది. ఇప్పుడు కూడా రోజువారీగా విచారణ పూర్తి చేయాల్సిందేనని ఆదేశించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కౌంటర్లు దాఖలు చేయకపోయినా, తమ వాదనలు వినిపించకుండా వాయిదాలు తీసుకున్నా, విచారణకు హాజరుకాకపోయినా స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. వచ్చే వాయిదా నాటికి స్పీకర్ తన ముందున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోతే కోర్టు ధికరణ చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించింది. ‘న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయననే తేల్చుకోనీయండి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది కల్పించుకొని ‘న్యూ ఇయర్ వేడుకలు ఎకడ జరుపుకోవాలో’ అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై స్పీకర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని ‘న్యూ ఇయర్ ఎకడ జరుపుకోవాలనే’ అనే వ్యాఖ్య చాలా స్పష్టంగా (క్లిస్టర్ క్లియర్‌గా) ఉందని, వివరణ అవసరం లేదని చెప్పారు.
సుప్రీంకోర్టు ఆదేశించినా చర్యల్లేవు : ఆర్యమ సుందరం
పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా స్పీకర్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రోజువారీ విచారణ చేయలేదని చెప్పారు. మూడు వారాల కిందట నాలుగు కేసుల్లో వాదనలు పూర్తి చేశారని, ఇప్పటివరకు వాటిపై తీర్పు చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. మరో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుల్లో మూడు వారాల కిందటే సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారని చెప్పారు. అయితే వాదనలకు ఇప్పటివరకు స్పీకర్ తేదీ, సమయం ఇవ్వలేదని వివరించారు. మూడు వారాలు దాటుతున్నా ఫిర్యాదుదారుల వాదనలు వినిపించేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు.
మరో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉన్న ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో కూడా తెలియదని, స్పీకర్ వాటి జోలికే వెళ్లలేదని చెప్పారు. ఆ ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కనీసం కౌంటర్లు కూడా దాఖలు చేయలేదని తెలిపారు. దీనిని బట్టి స్పీకర్‌కు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల కేసులను పూర్తి చేయాలనే ఉద్దేశమే లేనట్టు కనిపిస్తున్నదని, ఇదే విధానాన్ని కొనసాగిస్తే సుప్రీంకోర్టుకే మళ్లీ వివాదం చేరే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇలా కాలయాపన చేస్తూ ఉంటే ఐదేండ్ల ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసిపోవచ్చని, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడేవరకు ఈ వ్యవహారాన్ని సాగదీసే అవకాశం ఉన్నదని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కూడా స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి మరో ఎనిమిది వారాల గడువు కోరడం దారుణమన్నారు. గతంలో వరదలు సంభవించాయని చెప్పి పది రోజులు సమయం తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ 8 వారాల గడువు కోరడం ద్వారా కాలయాపనకు సమయం కోరుతున్నట్టు ఉన్నదన్నారు. అందుకే కోర్టుధికరణ నోటీసులు జారీ చేయాలని కోరుతున్నామని తెలిపారు.
వరదల వల్ల విచారణ ఆలస్యం
ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం, స్పీకర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ కోర్టు హాల్లోకి ప్రవేశించారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. విచారణ పూర్తిచేసి తుది నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు మరో ఎనిమిది వారాల గడువు కావాలని కోరారు. వరదల వల్ల పది రోజులపాటు స్పీకర్ విచారణ చేయలేకపోయారని చెప్పారు. నాలుగు ఫిర్యాదులపై విచారణ పూర్తయ్యిందని, తీర్పు వెలువడాల్సి ఉన్నదని చెప్పారు. మరో నలుగురు ఎమ్మెల్యేల మీద ఫిర్యాదులపై సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్టు తెలిపారు. మరో రెండు కేసుల్లో విచారణ చేపట్టాల్సి ఉన్నదని వివరించారు. చివరి అవకాశంగా మరో ఎనిమిది వారాల గడువు ఇస్తే మొత్తం వ్యవహారం కొలికి వస్తుందని కోరారు. ఇప్పటివరకు ఈ కేసులో 20 నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఇలా గడువు మంజూరు చేసుకుంటూపోతే ఎమ్మెల్యేల ఐదేండ్ల పదవీకాలం పూర్తవుతుందని తెలిపారు. పుణ్యకాలం ముగిసిన తర్వాత తీర్పు వచ్చినా ఉపయోగం ఉండదని, మళ్లీ ఎన్నికలు వస్తాయన్నారు. ఎనిమిది వారాల గడువు ఇచ్చేందుకు ధర్మాసనం సైతం నిరాకరించింది. రెండు వారాల్లోనే ఫిరాయింపుల కేసులను తేల్చాలని ఉత్తర్వులు ఇవ్వబోతుండగా, సింఘ్వీ పదేపదే కోరడంతో గడువును నాలుగు వారాలకు పెంచింది. ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19న కేసు విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.
రెండు కేసుల జోలికి స్పీకర్ వెళ్లనేలేదు
తొలుత కేసు విచారణకు రాగానే, తెలంగాణ ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ కరణం స్పందిస్తూ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు వేరే బెంచ్‌ల్లో ఇతర కేసులను వాదిస్తున్నారని, విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. దీంతో కాసేపు వాయిదా వేసి, తిరిగి ప్రారంభం కాగానే చిట్టచివరి కేసుగా విచారణ చేయాలని కోరడంతో ధర్మాసనం నిరాకరించింది. రెండు వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తేల్చాలని స్పష్టం చేసింది. దీంతో శ్రవణ్ వాదనలు వినిపిస్తూ.. నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి చేశారని, తీర్పు వెలువరించాల్సి ఉన్నదని చెప్పారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందిని అనర్హులుగా ప్రకటించాలన్న కేసులను రోజువారీగా విచారణ జరపాలని ఆదేశించినా ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఈ దశలో పిటిషనర్లు కేటీఆర్, కౌశిక్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం కల్పించుకుని, నలుగురు ఎమ్మెల్యేల కేసులో 3 వారాల క్రితమే వాదనలు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు స్పీకర్ తీర్పు చెప్పలేదని తెలిపారు. మరో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసుల్లో సాక్ష్యాధారాలు సమర్పించినా వాదనలు వినిపించేందుకు తేదీలను స్పీకర్ ఖరారు చేయలేదని చెప్పారు. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని తెలిపారు. స్పీకర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ఆలోచన స్పీకర్‌కు లేదని చెప్పారు.
మీకు రాజ్యాంగ రక్షణలు ఉండవు
నిర్ణయం తీసుకోవడానికి మరికొంత గడువు కావాలని కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశామని స్పీకర్ కార్యాలయ కార్యదర్శి తరఫు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా ఇంకా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారు? మీకు ఎందుకు సమయం ఇవ్వాలి’ అని ప్రశ్నించింది. ‘విచారణ రోజువారీగా జరిపి పూర్తి చేయాలని గతంలో ఆదేశిస్తే ఎందుకు చేయలేదు?’ అని నిలదీసింది. ‘ఫిరాయింపు అభియోగాలు ఎదురొంటున్న ఎమ్మెల్యేలు కావాలనే విచారణకు హాజరుకాకపోయినా, కౌంటర్లు దాఖలు చేయకపోయినా, ఉద్దేశపూర్వకంగా వాయిదాలు వేసే ప్రయత్నాలు చేసినా అనర్హత వేటు వేయాలని ఆదేశించాం’ అని గుర్తుచేసింది. పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్‌కు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణలు ఉండవని తేల్చిచెప్పింది. ఫిరాయింపుల కేసులను స్పీకర్ హోదాలో విచారణ చేయబోరని, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో కేసులను విచారించి తీర్పు చెప్తారంటూ న్యాయ/రాజ్యాంగ అధికరణల్లోని కీలక విషయాలను ఉదహరించింది. ఈ మేరకు గతంలో వెలువడిన తీర్పులను కూడా ప్రస్తావించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోనిపక్షంలో వాటిపై హైకోర్టు/సుప్రీం కోర్టు న్యాయ సమీక్ష చేసి తీర్పులు చెప్పేందుకు వీలుంటుందని గుర్తుచేసింది. ‘స్పీకర్ నిర్ణయం తీసుకుంటే సరే సరి.. లేకపోతే సుప్రీంకోర్టే తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది. కోర్టు ధికరణ పిటిషన్లో స్పీకర్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. చర్యలు తీసుకుంటారా లేదా కోర్టు ధికరణ ఎదురోవాలని నిర్ణయం తీసుకుంటారో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలోని స్పీకర్ ఇష్టమని పేర్కొన్నది. ఈసారి తమ ఆదేశాలను అమలు చేయనిపక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకొంటారో మీరే తేల్చుకోండి
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ వ్యవహారంలో స్పీకర్ చర్యలు తీసుకుంటారా? లేక కోర్టు ధికరణను ఎదురొంటారా? అనేది ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇష్టం. ఒకవేళ కోర్టు ధికరణ పరిణామాలు ఎదుర్కోవాలనుకుంటే న్యూ ఇయర్ వేడుకలు ఎకడ జరుపుకొంటారో తేల్చుకోండి.
-తెలంగాణ స్పీకర్‌కు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి హెచ్చరిక