హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంట్పై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం తెలుపుతూ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సర్కారుకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. బాధితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆదిత్య సొంది, విద్యాసాగర్, మిథున్ శశాంక్ వాదించారు. విచారణకు బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, ఏనుగుల రాకేశ్రెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పంతానికి పోకుండా జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46ను రద్దు చేసి, బాధితులను ప్రభుత్వ ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలని కోరారు. బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అండ, కేటీఆర్ సహకారంతో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టంచేశారు. రాకేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న సుప్రీంకోర్టులో జరిగే తదుపరి విచారణ సందర్భంగా ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవాలని హితవు పలికారు.