Supreme Court | ‘జలవివాదాల పరిష్కారానికి కమిటీ వేసుకున్నారు. మూడు నెలల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుందని మీరే చెప్తున్నారు. మరి అప్పటివరకు ఆగాలి కదా? అప్పుడే కోర్టుకు ఎందుకు వచ్చారు?’ అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది.
ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై స్టే ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పింది. తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై ధర్మాసనం అనుమానాలు వ్యక్తంచేసింది. ఇది సివిల్ వివాదమని తేల్చి చెప్తూ.. విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రేవంత్ ప్రభుత్వ వైఫల్యం, డొల్ల వాదనల ఫలితంగా సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణకు ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం- నల్లమలసాగర్ లింక్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్ వేయడానికి ముందే పీఎన్లింక్పై కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడం.. సుప్రీంలో మన వాదన పలుచన చేసింది. మీకు మీరుగా కమిటీ వేసుకున్నాక.. కోర్టుకు ఎందుకు వచ్చారంటూ ద్విసభ్య ధర్మాసనం నిలదీసింది. కేటాయింపులకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీలను మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును (పీఎన్ఎల్పీ) చేపట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. డీపీఆర్ తయారీకి టెండర్లను కూడా పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ, పనులు నిలిపివేసేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్య బాగ్చితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏ విధమైన అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. అనుమతులకు లోబడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని, దాని స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు అభ్యంతరం చెప్పినా ఫలితం రాలేదని తెలిపారు. పైగా, పీఎన్ఎల్పీ ప్రీ ఫీజిబులిటీ రిపోర్టును (పీఎఫ్ఆర్) కేంద్రం పరిశీలిస్తున్నదని చెప్పారు. కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు వ్యతిరేకంగా నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ ప్ర భుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మాణాలు పూర్తిచేశాక న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నా ఫలితం ఉండబోదని వివరించారు. అందుకే చట్టవ్యతిరేకంగా చేపట్టిన నిర్మాణ పనులను నిలిపివేసేలా పోలవరం ప్రాజెక్టు అథారిటీని(పీపీఏ) ఆదేశించాలని కోరారు. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు జారీ చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అంతేగాకుండా కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ఆర్థికసాయం అందించకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. తక్షణమే సుప్రీంకోర్టు స్పందించి కేంద్ర జలసంఘం, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సదరు ప్రాజెక్టు నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవా ది ముకుల్ రోహత్గీ, న్యాయవాది జగదీశ్ గుప్తా వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని, తెలంగాణ రాష్ట్రమే గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నదని ఆరోపించారు. తాము కేవలం పీఎన్ఎల్పీ ఫీజిబులిటీ రిపోర్టు మాత్రమే రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తమ రాష్ట్ర భూభాగంలో చేసే నిర్మాణాలపై పొరుగున ఉన్న తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారత ఏమిటని ప్రశ్నించారు. స్టే ఉత్తర్వులు జారీకానందున ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్ ప్రక్రియ ముందుకు సాగుతుందని వెల్లడించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు ఏపీ రాష్ట్ర ప్రాజెక్టు అని కోర్టుకు నివేదించారు. ఈ దశలో తెలంగాణ అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి కల్పించుకుని నిర్మాణాలు చేపట్టొద్దని కేంద్ర జల సంఘం చెప్పిందని అన్నారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తూ స్టే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఇరుపక్షాల వాదనల అనంతరం సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. సివిల్ సూట్లో జోక్యం చేసుకునే అధికారం సుప్రీం కోర్టుకు ఎకడ ఉందో చెప్పాలని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు ఎలా జారీ చేయాలో చెప్పాలని కూడా ప్రశ్నించింది. ప్రాజెక్టు నివేదిక కోసమే టెండర్ పిలుస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నదని గుర్తు చేసింది. ‘జలవివాదాల పరిషారం కోసం కేంద్రం కమిటీ వేసిందని మీరే (తెలంగాణ ప్రభుత్వమే) చెప్తూ, కోర్టుకు వచ్చి స్టే కోరడం ఏమిటి’ అని ధర్మాసనం ఆక్షేపించింది. ఆ కమిటీ ఏం చేస్తుందో చూడాలి కదా అని తలంటింది. ‘పోలవరం జాతీయ ప్రాజెక్టు కదా.. జాతీయ ప్రాజెక్టులో న్యాయపరిధి కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది’ అనే నిబంధనలను గుర్తు చేసింది. గోదావరి జలాల వినియోగ హకులు తెలంగాణ, ఏపీలకు మాత్రమే కాదని, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఉన్నాయని, అన్నిరాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడిన వ్యవహారమని ధర్మాససనం తేల్చిచెప్పింది. కేంద్ర ప్రాజెక్టును రాష్ట్ర (ఏపీ) ప్రభుత్వం మార్చడానికి వీల్లేదని, అయితే నల్లమలసాగర్ రాష్ట్ర ప్రాజెక్టు అని ఏపీ చెప్తున్నదని, ఈ నేపథ్యంలో జలవివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏం తేల్చుతుందో వేచి ఉండాలని తెలంగాణకు సూచించింది. కమిటీ నివేదిక వరకు స్టే ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య సివిల్ వివాదంలో స్టే ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. అవార్డు ఉల్లంఘన సివిల్ వివాదం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సివిల్ సూట్ దాఖలు చేసుకోవడమే మిగిలిన మార్గమని సూచించింది. రెండు రాష్ట్రాలు చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిషరించుకోవచ్చు కదా అని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 12కి వాయిదా వేసింది.
హైదరాబాద్, జనవరి5 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని, కచ్చితంగా అడ్డుకుని తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ 1980 అవార్డ్‌ను ఉల్లంఘించి ఏపీ పనులను చేపడుతున్నదన్నారు. సోమవారం ఆయన శాసనసభలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తెలంగాణ జల హకులపై గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ పూనుకుందని, ఆ పార్టీ ఆరోపణలు అర్థరహితమని కొట్టి పారేశారు. పోలవరం-నల్లమల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రసంస్థలకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని నియమించామని, రిట్ పిటిషన్‌ను సూట్ పిటిషన్ గా మార్చి దాఖలు చేయాలని సూచించామని వెల్లడించారు.
రేవంత్ సర్కార్ నిర్వాకం ప్రస్తుతం తెలంగాణకు పెనుముప్పుగా పరిణమించింది. సుప్రీంకోర్టులో వాదనలకు విలువలేకుండా చేశాయి. పోలవరం బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు, ఇతర జలవివాదాల అంశంపై కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో గత జూలై16 ఢిల్లీ వేదికగా ఇరు రాష్ర్టాల సీఎంలు సమావేశమై కమిటీ వేయాలని అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇరు రాష్ర్టాలు తమ అధికారుల పేర్లను ప్రతిపాదిస్తే కేంద్రం నుంచి కూడా ఇద్దరు అధికారులను కేటాయించి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సైతం అప్పుడే ప్రకటించారు. గత నెల 15న ఏపీ తరఫున అధికారుల పేర్లను, కేంద్రానికి నివేదించగా, తెలంగాణ ప్రభుత్వం 23న అధికారుల పేర్లను పంపింది. దీంతో కేంద్రం వెంటనే సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో కేంద్ర సంస్థలు, ఇరు రాష్ర్టాల అధికారులు కలిపి 15 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. 3 నె లల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీంకోర్టు ఇదే కమిటీని సాకుగా చూపి నల్లమలసాగర్ ప్రాజెక్టు పనులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడం గమనార్హం.