హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, మెయిన్ పరీక్షను వాయిదా వే యాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయ డం చట్ట విరుద్ధమంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో కొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే 2024 గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14తప్పులున్నాయని, మెయిన్‌ను వాయిదా వేయాలని కూడా అభ్యర్ధులు కోరారు. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హులు కానందున మెయిన్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొన్నది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన ధర్మాసనం, త మ జోక్యం వల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతుందని కూడా అభిప్రాయపడింది.