న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సైన్యంలో శాశ్వత కమిషన్ కోరుతూ 72 మంది మహిళా అధికారులు తమను ఆశ్రయించిన కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. 39 మంది మహిళా అధికారులకు ఏడు రోజుల్లోగా శాశ్వత కమిషన్ను మంజూరు చేయాలని అదేశించింది. 25 మందికి శాశ్వత కమిషన్ను ఎందుకు నిరాకరించారో కారణాలు తెలుపాలని కోరింది. సైన్యంలో 14 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకొన్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించాలని గతేడాది ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే, అర్హత ఉన్నప్పటికీ 72 మంది మహిళా అధికారులకు సైన్యం శాశ్వత కమిషన్ను నిరాకరించింది. దీంతో ఈ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరుపగా.. 40 మందికి శాశ్వత కమిషన్ కల్పిస్తామని, 25 మంది క్రమశిక్షణారాహిత్యం తదితర కారణాలతో అనర్హులని, మరో ఏడుగురు వైద్య కారణాల రీత్యా శాశ్వత కమిషన్ కల్పించడానికి అనర్హులని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 40 మందిలో ఒకరు స్వచ్ఛందంగా శాశ్వత కమిషన్ వదులుకొన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలను జారీచేసింది.